యమదూతలు వస్తున్నయ్..
Drone Technology in Modern Warfare :ఆధునిక యుద్ధంలో డ్రోన్లు కీలకంగా మారుతున్నాయి. నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటం, శత్రు లక్ష్యాలపై సులభంగా దాడి చేసేలా ఉంటుండటంతో డ్రోన్ల తయారీపై ప్రపంచ దేశాలు దృష్టి సారిస్తున్నాయి. మూడేళ్లుగా సాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో డ్రోన్లదే కీలక పాత్ర. ఉక్రెయిన్-రష్యా నిత్యం వందలాది డ్రోన్లతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్-గాజా యుద్ధంలోనూ డ్రోన్లు కీలక పాత్ర పోషించాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో టర్కీ తనకు ఇచ్చిన డ్రోన్లతో పాకిస్తాన్ దాడులు చేసింది. అయితే, యాంటి డ్రోన్ సిస్టమ్స్‌తో భారత్ వాటిని సమర్థంగా కూల్చివేసింది. పాకిస్థాన్ వైపు నుంచి పంజాబ్‌లోకి అనేక సార్లు డ్రోన్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరగ్గా భారత దళాలు వాటిని కూల్చివేశాయి.
ఈ నేపథ్యంలో భారత్ సైతం అధునాతన డ్రోన్లు, యాంటి డ్రోన్ సిస్టమ్స్‌పై దృష్టి సారించింది. తాజాగా “యమదూత” 3D పేరుతో సరికొత్త ఎటాక్ డ్రోన్లను రూపొందించింది. ఈ హైటెక్ డ్రోన్లు శత్రు దేశాల డ్రోన్ల కదలికలపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతాయి. ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నా శత్రు డ్రోన్లను కూల్చివేసేలా వీటిని తయారు చేశారు. సెన్సార్ ఫ్యూజన్ తో పాటు AI ఆధారంగా పనిచేస్తాయి. దీనిని డెహ్రాడూన్‌కు చెందిన రక్షణ సంస్థ BSS మెటీరియల్ (భారత్ సప్లై & సపోర్ట్ ఆఫ్ మిలిటరీ మెటీరియల్స్ అండ్ అడ్వాన్స్ టెక్నాలజీస్) ఉత్పత్తి చేసింది. సాధారణంగా బ్యాటరీ డ్రోన్లకు భిన్నంగా పెట్రోల్‌తో నడిచే ఇంజన్లను అమర్చారు… దీంతో గాల్లో ఎక్కువ సేపు ఉండనుంది.
AI సాయంతో శత్రువులను గుర్తించి దాడులు చేస్తుంది ఈ డ్రోన్. థర్మల్ సెన్సార్లు ఉండటం వల్ల రాత్రి వేళ సైతం ఇవి బాగా పని చేస్తాయి. ఆధునిక యుద్ధ రంగంలో డ్రోన్లదే కీలక పాత్ర అని యుద్ధ నిపుణులు చెబుతున్న నేపథ్యంలో భారత్ వీటి తయారీపై ప్రత్యేక దృష్టి సారించింది. వీటిని పూర్తి స్థాయిలో తయారు చేసి ఆర్మీకి అప్పగించనున్నారు.