సోషల్ మీడియా ప్రచారం అవాస్తం
ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే క్షేత్రస్థాయిలో నివృత్తి చేస్తాం
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జల్ సంచాయి జన బాగీదారిలో మంచిర్యాల జిల్లా ఎంపికై అవార్డు పొందిందని, జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశాలు పూర్తిగా అవాస్తవమని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని మందమర్రి మండలం పొన్నారం గ్రామపంచాయతీ పరిధిలో పర్యటించి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దీనికి సంబంధించిన వ్యవహారంలో ఎవరికైనా ఏమైనా అనుమానం ఉంటే క్షేత్రస్థాయిలో నివృత్తి చేస్తామన్నారు. జల్ సంచాయి జన బాగీదారి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులపై అధికారులు, సిబ్బంది కష్టపడి పని చేస్తేనే జాతీయస్థాయిలో గుర్తింపు లభించి జిల్లాకు అవార్డు వచ్చిందన్నారు.
కార్యక్రమంలో భాగంగా సీఎస్ఆర్, డీఎంఎఫ్టీ నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి పనుల పురోగతి ఫోటోలను సంబంధిత పోర్టల్ లో అప్ లోడ్ చేశారని, ఆ పనుల జియో టాగింగ్ పూర్తయ్యిందన్నారు. జిల్లాలో జరిగిన అభివృద్ధి పనులపై నెల రోజుల పాటు కేంద్ర ప్రభుత్వ బృందం తనిఖీలు చేసి పనులను నిర్ధారించిన తరువాత ఫోటోలు అప్ లోడ్ చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ సహాయం లేకుండా ప్రజలు వ్యక్తిగతంగా చేసుకున్న పనులకు సంబంధించి పబ్లిక్ పోర్టల్ లో ఫోటోలు అప్ లోడ్ చేయవచ్చన్నారు. క్యాచ్ ద రైన్ పథకంలో సైతం పథకానికి సంబంధించిన ఫోటోలను అప్ లోడ్ చేయవచ్చని, ఈ క్రమంలో ఎవరైనా తప్పుగా పోర్టల్ లో ఫోటో అప్ లోడ్ చేయవచ్చని తెలిపారు. జల్ సంచాయి జన బాగీదారి కార్యక్రమంలో పనులు పూర్తి స్థాయిలో జరిగి ఎం.బి., మస్టర్ లను నిర్ధారించిన అనంతరం ఫోటోలు అప్ లోడ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో వస్తున్న ఫోటోలకు, అవార్డుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో ఉద్దేశపూర్వకంగా జిల్లా యంత్రాంగానికి అప్రతిష్ట తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారని, అవాస్తవ వార్తలను ప్రచారం చేయవద్దని తెలిపారు.