యోధుడా… అల్విదా…
తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ ప్రమాదంలో భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కన్నుమూశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కలేదు. దీంతో ఆ హెలికాఫ్టర్‌లో ప్రయాణించిన మొత్తం 14 మంది ప్రయాణీకుల్లో ఏ ఒక్కరు బతికి బట్టకట్టలేదు.
తమిళనాడు రాష్ట్రం కొయంబత్తూర్, కూనూరు మధ్యలో బుధవారం ఈ చాపర్ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌లో బిపిన్ రావత్‌తో పాటు, ఆయన సిబ్బంది, కొందరు కుటుంబసభ్యులు కలిసి మొత్తం 14 మంది ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారమందుకున్న ఆర్మీ, పోలీస్, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. విల్లింగ్టన్ ఆర్మీ కేంద్రం నుంచి బయల్దేరిన ఈ ఎంఐ సిరీస్ హెలికాప్టర్.. కాసేపటికే కుప్పకూలినట్లు తెలుస్తోంది.
ప్రమాదం తర్వాత చెల్లాచెదురుగా పడివున్న శరీర భాగాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించిన అనంతరం 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ఇదే ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ సతీమణి మధులికా కూడా మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో వున్న జనరల్ బిపిన్ రావత్ పరిస్ధితి అత్యంత విషమంగా వుంది. అయితే ఆయన ప్రాణాలను కాపాడేందుకు డాక్టర్లు తీవ్రంగా ప్రయత్నించారు.
కాగా.. ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం పార్లమెంట్‌లో ప్రకటన చేయనుంది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు పార్లమెంట్‌లో ఈ మేరకు ప్రకటన చేస్తారని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఘటన అనంతర పరిస్థితులను రాజ్‌నాథ్ స్వయంగా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కేబినెట్ అత్యవసర సమావేశంలో ప్రధాని మోడీకి వివరాలు తెలియజేసిన ఆయన.. ఢిల్లీలోని రావత్ నివాసానికి కూడా వెళ్లి ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.