రేపు కొండ‌గ‌ట్టుకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

-ఆంజనేయ క్షేత్రానికి ఉప ముఖ్యమంత్రి
-పవన్ కళ్యాణ్ చొరవతో టి.టి.డి. నిధులు మంజూరు
-టి.టి.డి. నుంచి రూ.35.19 కోట్ల నిధులతో సత్రం, దీక్షా విరమణ మండపం నిర్మాణాలకు శంకుస్థాపన

Kondagattu:ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన కొండగట్టు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy Chief Minister Pawan Kalyan) శనివారం దర్శించుకోనున్నారు. ఆయ‌న తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) సమకూర్చే నిధులతో నిర్మించనున్న భవనాలకు శంకుస్థాపన చేస్తారు. ఆయ‌న గెలిచిన త‌ర్వాత కొండ‌గ‌ట్టుకు రావ‌డం ఇది రెండోసారి. మొద‌టిసారి గెలిచిన త‌ర్వాత కొండగట్టు అంజ‌న్న స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆ సంద‌ర్భంలో దేవాలయ అధికారులు, అర్చకులతో మాట్లాడారు. కొండగట్టు క్షేత్రంలో ఉన్న ఇబ్బందులు తెలుసుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇక్క‌డ దీక్ష విరమణ మండపం, విశ్రాంతి గదులతో కూడిన సత్రం అవసరమని అధికారులు, అర్చకులు ఆయ‌న‌ను కోరారు. ఆలయ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

దీంతో టీటీడీ సహకారంతో కొండగట్టు క్షేత్రంలో వీటి నిర్మాణానికి పవన్ కళ్యాణ్ ప్రతిపాదనలు చేశారు. ఈ వ్య‌వ‌హారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి ఆయ‌న కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే విష‌యాన్ని టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు(TTD Chairman B.R. Naidu)తో సైతం చర్చించారు. టీటీడీ బోర్డు రూ. 35.19 కోట్ల నిధులు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణాలు చేపట్ట‌నున్నారు. ఒకేసారి 2 వేల మంది భక్తులు దీక్షలు విరమించేలా మండపం నిర్మించనున్నారు. శనివారం నిర్వహించే కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడు, ఏపీ శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ బోర్డు మెంబర్లు బి.ఆనందసాయి, బి.మహేందర్ రెడ్డి, టీటీడీ ఎల్.ఎ.సి. ఛైర్మన్ ఎన్ శంకర్ గౌడ్, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శ రామ్ తాళ్లూరి తదితరులు పాల్గొననున్నారు.

ఆలయం అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, శ్రేణులతో సమావేశం కానున్నారు. ఆ తర్వాత ఇటీవలి తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన వారితోనూ సమావేశం అవుతారు. కొడిమ్యాల సమీపంలోని బృందావనం రిసార్టులో ఈ సమావేశాలు ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు ఆర్.కె.సాగర్, రాజలింగం, దామోదర్ రెడ్డి, ఎం. కావ్య, పి. శిరీష తదితరులు పాల్గొంటారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like