ఎన్నికలకు ముందే 68 సీట్లు గెలిచారు
Maharashtra Municipal Elections:మహారాష్ట్రలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార ‘మహాయుతి’ కూటమి సంచలనం సృష్టించింది. 15న పోలింగ్ జరగాల్సి ఉండగా, నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఏకంగా 68 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 44 స్థానాలను కైవసం చేసుకోగా, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 22 స్థానాలు, అజిత్ పవార్‌కు చెందిన ఎన్సీపీ 2 స్థానాలను గెలుచుకుంది. థానే జిల్లాలోని కళ్యాణ్-డోంబివిలి కార్పొరేషన్‌లో అత్యధికంగా 22 స్థానాలు ఏకగ్రీవం కావడం గమనార్హం.
అంతేకాదు, పుణె, పింప్రి-చించ్వాడ్, పన్వేల్, భివండి, ధూలే, జల్గావ్, అహిల్యానగర్ వంటి ప్రాంతాల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనకు 22 స్థానాలు పోటీ లేకుండానే దక్కగా, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ)కి రెండు స్థానాలు ఏకగ్రీవంగా లభించాయి. పుణెలోని 35వ వార్డులో బీజేపీ అభ్యర్థులు మంజుషా నాగపురే, శ్రీకాంత్ జగ్తాప్‌లకు ప్రత్యర్థులు నామినేషన్లు వెనక్కి తీసుకోవడంతో వీరిద్దరినీ ఏకగ్రీవంగా విజేతలుగా ప్రకటించారు. వీరిద్దరూ 2017 నుంచి 2022 వరకు అదే వార్డును ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామాలపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు మురళీధర్ మోహోల్ స్పందిస్తూ, ఈ ఏకగ్రీవ విజయాలు బీజేపీ పాలనకు ప్రజలు ఇస్తున్న మద్దతుకు స్పష్టమైన నిదర్శనమని వ్యాఖ్యానించారు. పుణె నగరానికి వచ్చే మేయర్ కూడా బీజేపీ నుంచే వస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “మాకు మొత్తం 125 స్థానాల లక్ష్యం ఉంది. అందులో ఇప్పటికే రెండు స్థానాలు ఏకగ్రీవంగా దక్కాయి. ఇంకా 123 స్థానాలు మిగిలి ఉన్నాయి” అని తెలిపారు. పార్టీ అభ్యర్థుల విజయాలకు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ఉన్న ప్రజాదరణతో పాటు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్ రూపొందించిన ఎన్నికల వ్యూహమే ప్రధాన కారణమని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. గతంలో మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో సాధించిన విజయం, ప్రస్తుత వ్యూహకర్తల కృషి వల్లే ఈ ముందస్తు ఆధిక్యం సాధ్యమైందని బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
మరోవైపు, ఈ ఏకగ్రీవ విజయాలపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఈడీ, సీబీఐ వంటి సంస్థల పేర్లతో భయపెట్టి లేదా ప్రలోభాలకు గురిచేసి తమ అభ్యర్థులతో నామినేషన్లు ఉపసంహరింపజేశారని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంకా చతుర్వేది విమర్శించారు. ఈ పరిణామాలపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం, ఏకగ్రీవమైన స్థానాల్లో అభ్యర్థులపై ఏదైనా ఒత్తిడి లేదా బెదిరింపులు జరిగాయా అనే అంశంపై విచారణకు ఆదేశించింది. ముంబై (బీఎంసీ) సహా రాష్ట్రవ్యాప్తంగా 29 కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనుండగా, 16న ఫలితాలు వెలువడనున్నాయి.