వరినాట్లు వేసిన ఎంపీ
చెమట చిందిస్తేనే రైతు జీవితం అర్థం అవుతుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ(Peddapalli MP Gaddam Vamsi Krishna) అన్నారు. ఆయన కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారంలో మహిళా రైతు కూలీలతో కలిసి పొలంలో దిగి నాట్లు వేశారు. వరినాట్ల అనంతరం వారితోనే కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల కష్టసుఖాలను ప్రత్యక్షంగా అనుభవిస్తూ వ్యవసాయ పనుల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందన్నారు. రైతు కుటుంబాల జీవన విధానాన్ని దగ్గరగా తెలుసుకునే అవకాశం లభించిందని తెలిపారు.
“రైతుల శ్రమకు గౌరవం ఇవ్వడమే నిజమైన ప్రజాప్రతినిధి ధర్మం. పొలంలో చెమట చిందిస్తేనే రైతు జీవితం అర్థమవుతుంది” అని స్పష్టం చేశారు వంశీ. రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వ్యవసాయం మరింత అభివృద్ధి చెందేలా అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని రైతులకు భరోసా ఇచ్చారు.