సమ్మెకు సిద్ధమయిండ్రు
బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ నేటి నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలు మూడు రోజులపాటు సమ్మె చేయనున్నాయి. సింగరేణిలో 23 భూగర్భ, 19 ఉపరితల గనులున్నాయి. 42 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం బ్లాకు-3, ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి బ్లాకు-3, మంచిర్యాల జిల్లాలోని కళ్యాణఖని-6, ఆసిఫాబాద్ జిల్లాలోని శ్రావణపల్లి బ్లాకులకు సింగరేణి సంస్థ రూ.167 కోట్లు ఖర్చు చేసింది. అన్వేషణతో పాటు ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేసుకుంది. బొగ్గు ఉత్పత్తి చేపట్టేందుకు అనుమతుల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆ నాలుగు బ్లాకులకు కేంద్ర ప్రభుత్వం వేలం ప్రకటన ఇచ్చింది. దీంతో ప్రైవేటు సంస్థలతో పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 3, 6 తేదీల్లో సింగరేణి యాజమాన్యంతో జరిపిన చర్చలు ఫలించకపోవడంతో గురువారం ఉదయం షిఫ్టు నుంచి 72 గంటల సమ్మెలోకి దిగేందుకు కార్మిక సంఘాలు నిర్ణయించాయి.
ప్రైవేటు వ్యక్తులను అడ్డుకుంటాం…
బొగ్గు బ్లాకుల వేలానికి ప్రతిపాదనలతో పాటు టెండర్లు వేసేందుకు కేంద్రం సిద్ధమవటం పట్ల సింగరేణి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 4 బ్లాకులను ఈ జాబితాలో చేర్చినా… భవిష్యత్తులో మిగిలిన వాటిపై ఈ ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. తమ కుటుంబాలను రోడ్డున పడేసేలా ఉన్న నిర్ణయాన్ని సాగుచట్టాల మాదిరిగానే కేంద్రం వెనక్కి తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. నిరసనలతో సర్కార్ దిగిరాకపోతే నిరవధిక సమ్మె చేసేందుకైనా సిద్ధమని తేల్చిచెబుతున్నారు. సమ్మెతో ప్రయోజనం లేకపోతే బొగ్గు బ్లాకుల కోసం వచ్చే ప్రైవేటు వ్యక్తులను అడ్డుకుంటామని చెబుతున్నారు.
ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం..
మరోవైపు. సింగరేణి సంస్థ తరపున కేంద్రానికి లేఖ రాయడంతోపాటు. ఆయా బ్లాక్‌లలో చేపట్టిన అన్వేషణ పనులను వివరించినట్లు యాజమాన్యం చెబుతోంది. బొగ్గు బ్లాక్‌ల కేటాయింపు రాష్ట్రానికి సంబంధించిన అంశం మాత్రమే కాదని అధికారులు వివరిస్తున్నారు. ఇప్పటికే కరోనా బొగ్గు ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపగా. కార్మికుల సమ్మెతో మరింత చూపే అవకాశముందని సంస్థ భావిస్తోంది. సింగరేణిలో రోజుకు 2.55 లక్షల టన్నులు ఉత్పత్తికి నష్టం జరగనుంది. ఇక వేతనాల రూపంలో కార్మికులకు ఒక్కరోజు 12.6 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంది. దాదాపు రూ.76 కోట్ల ఉత్పత్తి నష్టం జరుగుతుంది.