ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్.. మావో కీలక నేత పాపారావు హ‌తం..

మావో కీలక నేత పాపారావు హ‌తం..

Chhattisgarh Encounter:ఛత్తీస్‌గఢ్‌లో మరో ఎన్‌కౌంటర్(Chhattisgarh Encounter) జరిగింది. బీజాపూర్ నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. మావోయిస్ట్ కీలక నేత పాపారావుతో స‌హా ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో రెండు ఏకే-47 ఆయుధాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ప్రస్తుతం.. ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంట‌ర్‌లో మావోయిస్టు నేత పాపారావు మ‌ర‌ణించిన‌ట్లు పోలీస్ సూప‌రిండెంట్ జితేంద్ర యాద‌వ్ తెలిపారు.

మావోయిస్టు పార్టీలో కీల‌క నేత‌…
పాపారావు మావోయిస్టు పార్టీలో కీల‌క నేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సుక్మా జిల్లా నిమ్మలగూడెం గ్రామానికి చెందిన పాపారావు డీకేఎస్​జడ్​సీఎం (దండకారణ్యం స్పెషల్​ జోనల్ కమిటీ సభ్యుడు) నుంచి పశ్చిమ బస్తర్ డివిజన్​కు కార్యదర్శిగా ఎదిగాడు. ఛత్తీస్​గఢ్​ అడవుల్లో మావోయిస్టులు సంచరించే బీజాపూర్ జిల్లాలో ఇప్పటి వరకు యుద్ధ తంత్రంలో ఆరితేరినవారు సుమారు వంద మందికి పైగా ఉండగా, వీరిలో పాపారావు అత్యంత కీలకమైన నాయకుడు. ఈయనను అత్యంత ప్రమాదకరమైన, ప్రతిభావంతమైన వ్యక్తిగా బ‌ల‌గాలు ప‌రిగ‌ణించేవి. దట్టమైన అడవులు, స్థానిక నెట్​వర్క్, తన పదునైన వ్యూహాలతో పాపారావు నిత్యం తప్పించుకునేవాడు.

ప్రధాన దాడుల్లో సూత్రధారి ఇత‌ను..
దశాబ్దాలుగా మావోయిస్టులకు పెట్టని కోటగా మారిన బీజాపూర్ జిల్లాలో ఇతడు చురుగ్గా ఉండేవాడు. అనేక ప్రధాన దాడుల్లో సూత్రధారి అని భ‌ద్ర‌తా ద‌ళాలు చెబుతున్నాయి. కుత్రు – బెద్రే రోడ్డులో జరిగిన ఐఈడీ పేలుడుకు ప్లాన్ చేసింది పాపారావు అని పేర్కొంటున్నాయి. అనేక మంది జవాన్ల మృతికి కారకుడు అని స్పష్టం చేస్తున్నాయి. ఇతడిపై రూ. 50 లక్షల రివార్డు ప్రకటించారు.

ఈ ఏడాది మొద‌ట్లోనే..
ఈ ఏడాది మొదట్లోనే పలు ఎన్‌కౌంటర్లు, మావోయిస్టుల లొంగుబాట్లు జరిగాయి. జనవరి 3న సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారిలో ఆరుగురు మహిళలు ఉన్నారు. సుక్మాలో 12 మంది, బీజాపూర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. వీరిలో కొంటా ఏరియా కమిటీ ఇన్‌ఛార్జ్ వెట్టి మంగడు వంటి కీలక నాయకులు ఉన్నారు. జనవరి 15న బీజాపూర్ జిల్లాలో 52 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనవరి 14న సుక్మాలో 29 మంది, జనవరి 8న దంతేవాడాలో 63 మంది, జనవరి 7న సుక్మాలో 26 మంది మావోయిస్టులు లొంగుబాట ప‌ట్టారు.

You might also like