క్రాస్ ఓటింగ్ భయం..
అధికార పార్టీకి అన్నీ ఉన్నా భయమే - దడ పుట్టిస్తున్న మహిళా స్వతంత్ర అభ్యర్థి - ఎక్కడ పుట్టి మునుగుతుందోనన్న ఆందోళన - ఎక్కడిక్కడ జాగ్రత్తలు తీసుకుంటున్న టీఆర్ఎస్ - రేపే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు
ఆదిలాబాద్ – ఆర్థిక బలముంది… అంగ బలమూ ఉంది… ఒక మంత్రి, ప్రభుత్వ విప్, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు… నడుగురు జడ్పీ చైర్మన్లు, ఒక ఎమ్మెల్సీ.. ఉన్న సైన్యమంతా ఇటు వైపే… కానీ ఓటమి భయం మాత్రం వెంటాడుతోంది.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శనిలా తయారయ్యింది పరిస్థితి … ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నా లోలోపల మాత్రం నేతలు కాస్తా ఆందోళనగానే ఉన్నారు.
అన్ని ఉన్నా గెలుస్తామో..? లేదో…? అనే ఆందోళన అధికార టీఆర్ ఎస్ పార్టీని వెంటాడుతోంది. పైకి మేకపోతు గాంభీర్యం నటిస్తున్నా లోపల మాత్రం ఓటమి భయం వెన్నాడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నల్లేరు మీద నడకలా నడిచేలా లేవు. దీనికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. టిక్కెట్టు కేటాయింపు దగ్గర నుంచి నేతలు క్యాంపునకు తరలివెళ్లే దాకా ఎన్నో మలుపులు. మొదట టిక్కెట్టు కేటాయింపు విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ స్థానికులకు షాక్ ఇచ్చారు. స్థానికులు పది మంది టిక్కెట్టు రేసులో ఉండగా వారందరనీ కాదని ఎన్ఆర్ఐ దండే విఠల్‌కు టిక్కెట్టు కేటాయించారు.
తమకు టిక్కెట్టు దక్కనందుకు స్థానిక నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీని నమ్ముకుని ఉన్న తమను కాదని వేరే వాళ్లకు టిక్కెట్టు ఇవ్వడం పట్ల వారు కోపంతో ఉన్నా దానిని బయటకు కనిపించడం లేదు. మంచిర్యాల నుంచి ఎమ్మెల్సీ పురాణం సతీష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, నిర్మల్ జిల్లా నుంచి కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, సీనియర్ నేతలు శ్రీహరిరావు, సత్యనారాయణ గౌడ్ అధిష్ఠానం దగ్గర అర్జీ పెట్టుకున్నారు. కొమురం భీం జిల్లా నుంచి అరిగెల నాగేశ్వరరావు, ఆదిలాబాద్ జిల్లాకు వస్తే లోకభూమారెడ్డి, మాజీ ఎంపీ గొడం నగేష్ ఇలా చాలా మంది నేతలు టిక్కెట్టు ఆశించారు.
సొంత పార్టీ వారే పుట్టి ముంచుతారా..?
బయటకు కనపడకున్నా సొంత పార్టీలో చాపకింద నీరులా అసమ్మతి రగులుతోంది. వీరంతా దండే విఠల్ ఓటమినే కోరుకుంటున్నారు. నామినేషన్ల విత్ డ్రా సమయంలో ఈ విషయం బయటపడింది. నామినేషన్ల విత్ డ్రా సమయంలో కొందరు నేతలు తమ వాళ్లతో నామినేషన్లు వేయించి డబ్బులు తీసుకున్నారు. అలాగే కొందరు నేతల అనుచరులు క్యాంపునకు కూడా వెళ్లలేదు. అది కూడా అధిష్టానానికి అనుమానాలు పెంచుతోంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ నేతలు సైతం డబ్బులు తీసుకుని తమ అనుచరులను విత్ డ్రా చేసుకున్న సమయంలో సొంత పార్టీ వారే పుట్టి ముంచుతారేమో అనే భావన నెలకొంది. దీంతో ఏం చేయాలో అర్ధం కాక టీఆర్ ఎస్ నేతలు తలలు పట్టుకుంటున్నారు.
ఎంపీటీసీలు హ్యాండిస్తారా…?
మరోవైపు ఎంపీటీసీల రూపంలో అధికార పార్టీని ఆందోళన వెంటాడుతోంది. వార్డు సభ్యులకు ఉన్న గౌరవం కూడా తమకు లేదని, తాము గెలిచి ప్రయోజనం లేదని ప్రజలకు సేవ చేయాలని ఏం చేయలేక నిస్సహాయంగా మిగిలిపోతున్నామని ఎంపీటీసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారు గెలిచినప్పటి నుంచి నిధులు, విధులు, అధికారాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీటీసీలు ఎన్నికైన నాటి నుంచి నిధులు కేటాయించకపోవడంతో కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగుతుండటంతో ఇదే సరైన సమయమని భావిస్తున్నారు. దీంతో వారు ఏ క్షణంలో తమకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుని ఓటేస్తారో అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 937 ఓట్లు కాగా, అందులో 554 మంది ఎంపీటీసీలు ఉన్నారు. మొత్తం ఓట్లలో వీళ్లదే కీలకపాత్ర. వీరు తిరగబడితే మాత్రం ఓటమి ఖాయమని భావిస్తున్నారు.
దడ పుట్టిస్తున్న మహిళా స్వతంత్ర అభ్యర్థి
ఇదంతా ఒక్కెత్తు కాగా, అధికార పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్న పెందూరు పుష్పారాణి పార్టీకి పెద్ద సవాల్‌గా మారింది. ఆమె ఆదివాసీ మహిళ కావడంతో ఆమెకు వ్యతిరేకంగా గళం విప్పేందుకు టీఆర్ ఎస్ నేతలు ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పటికే ఆదివాసీలకు టీఆర్ ఎస్ పార్టీ వ్యతిరకం అనే ముద్ర ఉంది. ఎవరైనా నేతలు ఆమెపై మాటల దాడి ప్రారంభిస్తే ఖచ్చితంగా ఆదివాసీలకు వ్యతిరేకంగా మాట్లాడతున్నారని ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి… ఎవరూ మాట్లాడం లేదు. మొదట ఆమెను విత్ డ్రా చేయించేందుకు ప్రయత్నించిన అధికార పార్టీ ఆ విషయంలో పూర్తిగా విఫలం అయ్యింది. ఆమె అభ్యర్థిత్వం కూడా అధికార పార్టీకి ఆందోళనగా మారింది. తమకు బలం లేకున్నా బీజేపీ, కాంగ్రెస్ పార్టీకి ఆమెకు మద్దతు పలికాయి. ఎంఐఎంతో పాటు, ఆదివాసీ ఓటర్లు ఏ పార్టీలో ఉన్నా ఆమెకే ఓటేసేందుకు సిద్ధం అయినట్లు సమాచారం.
ఒడ్డున పడేస్తారా..?
ఇక నామినేషన్ల విత్ డ్రా సమయంలో అధికార పార్టీ నేతల డొల్లతనం బయటపడింది. ముఖ్యంగా ఒక్కో నేత విత్ డ్రా సందర్భంగా కొందరు అధికార పార్టీ నేతల అనుచరులే సాక్షాత్తు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట ఖాతర్ చేయలేదు. కొందరు నేతలు ఆయా ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల మాట వినకుండా అలాగే ఉండిపోయారు. దీనికి తోడు అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు దెబ్బ కొట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇంద్రకరణ్‌రెడ్డి గతంలో పెంచి పోషించిన గ్రూపులే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంప ముంచే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు. చివరకు మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అందరినీ నామినేషన్లు ఉపసంహరించుకునేలా వ్యూహరచన చేశారు. అయినా తుడుం దెబ్బ నాయకురాలు పెందూరు పుష్ఫరాణి నేత రంగంలో ఉండటంతో ఎన్నిక అనివార్యం అయ్యింది. ఇలా ఇక్కడి నేతల మాటలు వినని నేతలు దండే విఠల్ గెలుపులో ఎలాంటి పాత్ర పోషిస్తారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా రేపు జరగనున్న ఎంఎల్‌సీ ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా సాగనున్నాయి.