రెండో రోజూ అదే జోరు…
సింగరేణిలో కార్మికుల సమ్మె రెండవ రోజు కొనసాగుతోంది. మొదటి రోజు పూర్తి స్థాయిలో సమ్మె విజయవంతం చేసిన కార్మికులు తమ పోరాట స్ఫూర్తి అదే స్థాయిలో కొనసాగిస్తున్నారు. కార్మికులు విధులకు హజరుకాకపోవడంతో గనులు బోసిపోతున్నాయి. అత్యవసర సిబ్బంది మినహా విధులకు ఎవరూ హాజరు కావవడం లేదు. గతంలో ఒక యూనియన్ సమ్మె చేస్తే మరో యూనియన్ విచ్ఛిన్నానికి ప్రయత్నాలు చేసేవి. కానీ ఇప్పుడు అన్ని కార్మిక సంఘాలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి సమ్మెకు దిగడంతో బొగ్గు పెల్ల బయటకు వెళ్లడం లేదు. సమ్మె కారణంగా నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. 40 కోట్ల రూపాయలు కార్మికుల వేతనాలకు నష్టం వాటిల్లింది. ఈ క్రమంలో కార్మిక సంఘాల నాయకులను ఆర్ఎల్సి చర్చలకు ఆహ్వనించింది. కాగా కార్మిక సంఘాల డిమాండ్లను యాజమాన్యం అంగీకరించకపోవడంతో కార్మికులు తమ సమ్మెను కొనసాగిస్తున్నారు. మూడు రోజుల పాటు సమ్మెలో పాల్గొంటామని చెబుతున్న కార్మికులు అవసరం అయితే రైతుల తరహాలో డిల్లీలో సైతం పోరాటం చేస్తామని చెబుతున్నారు. బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేస్తున్నారు.