సింగరేణి సమ్మెతో కదలిక
ఢిల్లీకి సింగరేణి ప్రతినిధుల బృందం - ఈ నెల 14,15,16 తేదీల్లో చర్చలు - కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రితో సమావేశం - కార్మిక సంఘాల ప్రతినిధులు, ఇద్దరు సింగరేణి డైరెక్టర్లు - రేపటి సమ్మె యథాతథం
మంచిర్యాల – సింగరేణిలో సమ్మె నేపథ్యంలో కదలిక వచ్చింది. కార్మిక సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేయడంతో బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణపై సింగరేణి యాజమాన్యం ఈ నెల 14న చర్చలకు సింగరేణి నుంచి బృందాన్ని తీసుకుని డిల్లీకి వెళ్లనుంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో సహా ఐదు జాతీయ కార్మిక సంఘాల నుంచి కార్మిక సంఘ ప్రతినిధులు, డైరెక్టర్ (పా), జీఎం(వెల్ఫేర్) వెళ్లనున్నారు. ఆరు కార్మిక సంఘాల నుంచి వెంకట్రావ్, వాసిరెడ్డి సీతారామయ్య, జనక్‌ప్రసాద్, రియాజ్ అహ్మద్, రాజారెడ్డి, మాధవన్ నాయర్ పాల్గొంటారు. అక్కడ కేంద్ర బొగ్గు శాఖ మంత్రితో చర్చలు జరపనున్నారు. బొగ్గు బ్లాక్‌ల అంశం కాకుండా మిగతా 11 డిమాండ్లపై త్వరలో ద్వైపాక్షిక సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించేందుకు యాజమాన్యం అంగీకారం తెలిపింది. సమ్మె మాత్రం మూడో రోజైన శనివారం సైతం జరగనుంది.