ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం

RTC Bus Accident: ఆదిలాబాద్ జిల్లాలో ఇవాళ ఉదయం ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి వాగులో పడిపోయింది. ఉట్నూరు మండలం శ్యామ్‌పూర్ వద్ద చోటు చేసుకుంది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉదయం ఆదిలాబాద్ బయల్దేరింది. శ్యామ్‌పూర్ వద్దకు చేరుకోగానే.. అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కల్వర్టును ఢీకొట్టి వాగులో పడిపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, కండక్టర్‌తో పాటు ప‌లువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రోడ్డుపై వెళ్లే ప్రయాణికులు సహాయక చర్యలు చేపట్టారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. బస్సు అద్దాలు పగులగొట్టి కిటికీల ద్వారా బయటకు తీసుకొచ్చి 108 వాహనాల్లో చికిత్స నిమిత్తం ఉట్నూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాయపడిన వారికి చికిత్స అందుతుండగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా డాక్టర్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం వారిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రమాదానికి కార‌ణాల‌ను పోలీసులు అన్వేషిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ముమ్మరం చేశారు.

You might also like