బొగ్గు బ్లాక్‌ల వేలం ఆపండి..
లోక్ సభ జీరో అవర్ లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి
బొగ్గుబ్లాక్‌ల వేలం ప్రక్రియ ఆపాలని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. లోక్ సభ జీరో అవర్‌లో ఆయన కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు సింగరేణి గుండెకాయ అని స్పష్టం చేశారు. ఇక్కడ నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్ర బొగ్గు గనుల శాఖ ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణ ప్రజలు బొగ్గు గనుల ప్రైవేటీకరణ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని వెల్లడించారు. దీన్ని వెంటనే విరమించుకోవాలన్నారు. కొత్తగూడెం,సత్తుపల్లి,శ్రావణపల్లి,కల్యాణ ఖని బ్లాక్‌లను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నం చేస్తోందన్నారు. దేశంలోనే వందేళ్ల చరిత్ర కలిగిన సింగరేణి బొగ్గు గనులు ప్రైవేట్ పరం చేయడం పట్ల అక్కడ ఉద్యోగులు సైతం సమ్మె చేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సింగరేణి బొగ్గు మీద ఆధారపడి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలలో థర్మల్ బొగ్గు ఉత్పత్తి అవుతుందన్నారు. కార్మికుల, దేశ ప్రయోజనాలను పక్కన పెట్టి కేంద్రం తీసుకుంటున్న ఈ నిర్ణయం జాతి ప్రయోజనాలకు వ్యతిరేకమని దుయ్యబట్టారు. వెంటనే కేంద్రం నాలుగు బొగ్గు ఉత్పత్తి బ్లాక్ ల ప్రైవేటీకరణ ను ఉపసంహరించుకోవాలన్నారు.