ప్రధాని మోదీ పొదుపు చర్యలు..
Prime Minister Modi’s Austerity Measures:ఏదైనా ప్రజలకు చెప్పడమే కాదు… తాను పాటించడంలో కూడా మన దేశ ప్రధాని ముందుంటారు… కొద్ది రోజుల కిందట ప్రజలకు పొదుపు మంత్రం పాటించాలని చెప్పిన మోదీ ఆయన కూడా స్వయంగా కొన్ని పొదుపు చర్యలు తీసుకుంటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన చెప్పిన పొదుపు మంత్రాన్ని ఆయన కూడా పాటించడం మొదలుపెట్టారు. తన కాన్వాయ్‌ని సగానికి సగం తగ్గించుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వ వాహనాల్లో ఎలక్ట్రిక్ వాహనాలను పెంచాలని మోదీ సూచించారు. నాలుగు రోజుల కిందట సికిందరాబాద్‌లో జరిగిన బహిరంగ వేదిక నుంచి దేశ ప్రజలు పొదుపు మంత్రాన్ని పాటించాలని సూచించారు మోదీ. బంగారం కొనడం ఏడాది పాటు నిలిపివేయాలని, పెట్రోల్, డీజిల్ విషయంలో సైతం పొదుపు పాటించాలని కోరారు. సొంత వాహనాలకు బదులు కార్ పూలింగ్, ప్రభుత్వ రవాణా వ్యవస్థలను వినియోగించుకోవడం, ఎలక్రిక్ట్ వాహనాలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.
అయితే, ఆయన చెప్పడమే కాకుండా ఆయన కూడా సొంతంగా వాటిని ఆచరిస్తున్నారు. తన కాన్వాయ్‌లో కార్ల సంఖ్యను 50 శాతం మేర తగ్గించించుకున్న ప్రధాని… తన కాన్వాయ్‌లో విద్యుత్ కార్ల సంఖ్యను పెంచేందుకు కూడా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఇందుకోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్లనే వినియోగించాలని, కొత్తవి కొనవద్దని కూడా ప్రధాని స్పష్టం చేసినట్టు సమాచారం. ఇతర ప్రభుత్వ శాఖలు కూడా ఈ తరహా పొదుపు చర్యలకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. ఇంధన పొదుపు కోసం ఏయే చర్యలు తీసుకోవాలనే దానిపై పలు శాఖలు సమీక్షలు జరుపుతున్నాయి.
ప్రధాని మోదీ పిలుపు మేరకు బీజేపీ పాలిత రాష్టాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం పొదుపుబాట పట్టారు. మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తన కార్ల సంఖ్యను 13 నుంచి 8కి కుదించారు. రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ తన కాన్వాయ్‌లో అనవసర కార్లను ఉంచవద్దని ఆదేశాలు జారీ చేశారు. కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ కూడా తన ఎస్కార్ట్ వాహనాన్ని వాడకూడదని నిర్ణయం తీసుకున్నారు.