మంత్రి పదవి ఇవ్వకుంటే రాజీనామా…
Malreddy Rangareddy sensational comments:తెలంగాణలో త్వరలోనే మంత్రివర్గ విస్తరణ ఉండనుందనే ప్రచారం నేపథ్యంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక సంచనల వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికైనా సిద్ధమని ప్రకటించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని, కుల సమీకరణాలు అడ్డు వస్తే త్యాగం చేయడానికి కూడా వెనుకాడబోనని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం అవసరమని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం జరగాలంటే తమ జిల్లా నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు దక్కాల్సిందేనని స్పష్టం చేశారు.
తనకు మంత్రి పదవి విషయంలో ఆయన ఇదివరకే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ పెద్దలను కూడా కలిసి తన విజ్ఞాపనలు అందించారు. రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని, నేను మంత్రి పదవి అడగడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు తానూ రేసులో ఉన్నట్లు స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వడానికి కుల సమీకరణాలు అడ్డొస్తే నేను రాజీనామా చేసి నా సీటును త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. సీఎం సభలో ప్లకార్డులు పట్టుకోవడం తప్పు కాదని, కార్యకర్తలు నాపై అభిమానంతో మంత్రి పదవి ఇవ్వాలని ప్లకార్డుల ద్వారా అభిప్రాయం చెప్పారన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌తో పాటు ఎవరూ తనకు వార్నింగ్ ఇవ్వలేదన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు దాటినా ఇంకా పూర్తి స్థాయి కేబినెట్ ఏర్పాటు కాలేదు. రాష్ట్రంలో ఇంకా రెండు మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీ చేయాల్సి ఉంది. త్వరలోనే ఈ రెండు మంత్రి పదవులతో పాటు శాఖల పునర్విభజన, స్పీకర్ మార్పు, డిప్యూటీ సీఎం పోస్టులు, ప్రభుత్వ విప్ల విషయంలోనూ హైకమాండ్ మార్పులు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు బలం చేకూర్చేలా ఇటీవలే శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను హైకమాండ్ ఢిల్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. ఆయన ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే క్రమంలో శనివారం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాహుల్ గాంధీని కలవడం తీవ్ర చర్చకు దారి తీసింది.