బ్రిడ్జి పనులు నిలిపివేత
మంచిర్యాల – నాసిరకంగా పనులు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సైతం ఆపివేయించారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వం బద్దెవెల్లి వద్ద బ్రిడ్జి నిర్మించేందుకు సన్నద్ధం అయ్యింది. దీనిలో భాగంగా కంట్రాక్టర్ అక్కడ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. అయితే ఆ పనుల్లో నాణ్యత సక్రమంగా లేదని ముల్కలపేటకు చెందిన గ్రామస్తులు మంగళవారం పనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ పనుల్లో నాణ్యమైన ఇసుక వాడటం లేదన్నారు. ఇసుక ప్రాణహిత నది తీరం నుంచి తేవాల్సి ఉండగా, స్థానికంగా ఉన్న ఒర్రె నుంచి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఐజాక్స్ లో కూడ 12-14 సిమెంట్ బస్తాలు వరకు వేయాలి కానీ 7 బస్తాలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కంకరలో కూడా 40 ఎంఎం కంకర ఎక్కువ వాడుతున్నారని చెప్పారు. బ్రిడ్జ్ నిర్మాణం ఇంజనీర్ల పర్యవేక్షణలో జరగడం లేదన్నారు. బ్రిడ్జి పనులు మొదలైనప్పటి నుంచి క్యూరింగ్ సరిగ్గా చేయడం లేదన్నారు. నాణ్యత విషయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా బ్రిడ్జ్ నిర్మాణంలో నాణ్యత పాటించాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ బెడ్డల రాజలింగు, మాజీ ఎంపీపీ ఆకుల లింగాగౌడ్,ఎంపీటీసీ దాగమ బాపు, బొర్కుటి సంతోష్,ఒడిల సుధాకర్,బుర్రి రమేష్,డోకే రాకేష్,పాలే కిషన్,
రామగిరి పున్నం,దందేర సతీష్ తదితరులు పాల్గొన్నారు.