భారీ వర్షం.. స్తంభించిన జనజీవనం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లో-లెవెల్ వంతెనలు జలమయమవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు చెట్లు నేలకొరిగి, ఇళ్లు కూలిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో లింగాపూర్, సిర్పూర్(యు) మండలాల్లోని పలుచోట్ల లో-లెవెల్ వంతెనలపై భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. వంతెనలపై నీటి ఉద్ధృతి పెరగడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
గుండి గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో డప్పు చాటింపు నిర్వహించారు. భారీ వర్షాలు కురుస్తున్నందున వాగులు, వంకల వద్దకు వెళ్లొద్దని, చేపల వేటకు దూరంగా ఉండాలని, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగల సమీపానికి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో వాగుల వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. హరిత పరిశీలించారు. ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు వద్ద వరద ప్రవాహ పరిస్థితిని పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారామె. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో అధికారులను అప్రమత్తం చేశారు.
మంచిర్యాల జిల్లాలో కూడా భారీ వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జన్నారం మండలం దొంగపెళ్లి రోడ్డు వద్ద నిర్మల్–మంచిర్యాల ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకొరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడగా, అధికారులు చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.
మరోవైపు కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో భారీ వర్షాలకు ఆత్రం హనుమంతు రేకుల ఇల్లు కూలిపోయింది. ఈ ఘటనలో ఆయన భార్య, పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చెన్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తాండూరు మండలం గంటల భీమన్న వాగు పొంగిపొర్లుతోంది… దీంతో 14 గూడాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కోటపల్లి మండలంలో లోతువాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో సుమారు ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారి కావడంతో ప్రతీ యేటా వర్షా కాలంలో తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నమంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సింగరేణిలోని ఓపెన్‌కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, ఓవర్‌బర్డెన్ (ఓబీ) వెలికితీత, బొగ్గు రవాణా కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఒక్కరోజులోనే సుమారు 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే దాదాపు 1.80 లక్షల క్యూబిక్ మీటర్ల ఓవర్‌బర్డెన్ (ఓబీ) వెలికితీతకు అంతరాయం ఏర్పడింది. గనుల్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించే పనులు వర్షాల తీవ్రత తగ్గిన తర్వాతే చేపట్టనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో బెల్లంపల్లి రీజియన్‌లో బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, రవాణా కార్యకలాపాలు నిలిచిపోవడం సింగరేణి ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వర్షాలు తగ్గిన వెంటనే సాధారణ కార్యకలాపాలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు.
ఇక నిన్నామొన్నటి వరకు బోసిపోయిన ప్రాజెక్టుల్లో నీటి వరద వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు కు గంటగంటకు ఇన్ ఫ్లో పెరుగుతోంది. ప్రస్తుత ఇన్ ఫ్లో: 22,505 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు అసలు నీటి మట్టం 700 ఫీట్లు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 686.700 ఫీట్లుగా ఉంది. నీటి సామర్థ్యం 3.495 టీఎంసీటలకు 1.169 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇక జలపాతాలు సైతం పరవళ్లు తొక్కుతున్నాయి. బోథ్ మండలం పొచ్చర జలపాతానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కుంటాల జలపాతం సైతం కొత్త అందాలను సంతరించుకుంది. తిర్యాణి మండలంలోని పంగిడి మాదర జలపాతం పరవళ్లు తొక్కుతొంది.
కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది.