వర్షాల వేళ నిర్లక్ష్యం వద్దు..

ప్రజలకు ఎస్పీ నితికా పంత్ విజ్ఞప్తి

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ కీలక సూచనలు చేశారు. వరద ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయవద్దని, ముఖ్యంగా వాగులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా అన్ని చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు.

ఆసిఫాబాద్ సమీపంలోని తుంపెల్లి వాగు, గుండి వాగును స్వయంగా పరిశీలించిన ఎస్పీ… వరద ఉధృతి తగ్గే వరకు ఎవరినీ వాగులు దాటేందుకు అనుమతించవద్దని పోలీసు, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాకపోకలను పూర్తిగా నిలిపివేసి, అవసరమైన భద్రతా సామగ్రిని సిద్ధంగా ఉంచాలని సూచించారు. రానున్న నాలుగు రోజుల పాటు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ… అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. వాగులు, వంకలు, చెరువులు, నదులు, లో-లెవల్ బ్రిడ్జిల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని, వరద ప్రభావిత ప్రాంతాలు, లో-లెవల్ బ్రిడ్జిల వద్ద ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు.

ఇక ప్రజలకు పోలీసు శాఖ పలు కీలక సూచనలు చేసింది. ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ దిగవద్దని, చేపల వేట కోసం వాగులు, చెరువులు, నదుల వద్దకు వెళ్లవద్దని హెచ్చరించింది. నీటిలో మునిగిన కల్వర్టులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దని సూచించింది.

పశువులను మేతకు తీసుకెళ్లే వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని… విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని తెలిపింది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు నీటి ప్రవాహాలు, విద్యుత్ ప్రమాదాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోరింది.

శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించవద్దని… అత్యవసరం కాని దూర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని, సెల్ఫీలు, రీల్స్ కోసం వరద ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకోవద్దని హెచ్చరించింది.

ప్రజలందరూ పోలీసు, రెవెన్యూ ఇతర ప్రభుత్వ శాఖల సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ విజ్ఞప్తి చేశారు.

You might also like