తెలంగాణ–మహారాష్ట్ర రాకపోకలు బంద్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని పెనుగంగా నది ఉగ్రరూపం దాల్చింది. వరద ఉద్ధృతి కారణంగా తెలంగాణ–మహారాష్ట్ర మధ్య కీలక రహదారి సంబంధాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఆనంద్పూర్ వద్ద బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.
ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని ఆనంద్పూర్ గ్రామ సమీపంలో పెనుగంగా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. భారీ వర్షాల కారణంగా బ్రిడ్జిపై నుంచి వరద నీరు ప్రవహించడంతో తెలంగాణలోని ఆనంద్పూర్, మహారాష్ట్రలోని దిగ్రస్ గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజల భద్రత దృష్ట్యా అధికారులు బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వాహనాలు ఇరువైపులా నిలిచిపోయాయి. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరిస్తోంది. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నారు.