పేకాట స్థావరంపై పోలీసుల మెరుపుదాడి
కాసిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమగూడెంలో ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ బృందం, టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆ ఇంటిపై మెరుపుదాడి నిర్వహించారు. ఈ దాడిలో నగదు పందేలు నిర్వహిస్తూ పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల వద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ.1 లక్షా 10 వేల 630 నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, మూడు మోటార్ సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న నగదు, ఇతర వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం కాసిపేట పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో జూదం, పేకాటతో పాటు ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు లేదా రామగుండం పోలీస్ కమిషనరేట్ నార్కోటిక్ బృందం, టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.