ఆ వంతెనలు వెంటనే పునరుద్దరిస్తాం
-భారీ వర్షాలతో దెబ్బతిన్న వంతెనల పరిశీలన
-త్వరితగతిన పునరుద్ధరణకు చర్యలు
-ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావంతో దెబ్బతిన్న ఏసీసీ క్వారీ బ్రిడ్జి, రాళ్లవాగు బ్రిడ్జిలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వంతెనల పరిస్థితిని సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించి, నష్టంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న వంతెనలను అత్యవసర ప్రాతిపదికన పునరుద్ధరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు, రాకపోకలు త్వరగా పునరుద్ధరించేందుకు అధికారులకు అవసరమైన సూచనలు చేసినట్లు వెల్లడించారు. ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, శాశ్వత పరిష్కారానికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, సంబంధిత శాఖల అధికారులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.