అధికార పార్టీ స‌ర్పంచ్‌పై… అంగ‌న్‌వాడీల ఫిర్యాదు

ఛీ. ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు… బెంచీల మీద ఎందుకు కూర్చున్నారు..? కింద కూర్చోండి… లేదంటే బ‌య‌ట కూర్చోండి. ఇదీ ఓ అధికార పార్టీ స‌ర్పంచ్ అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల‌పై చేసిన వ్యాఖ్య‌లు.. దీంతో వారు ఏకంగా క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేశారు..

మంచిర్యాల జిల్లా తాండూరు మండ‌లం మాదారం టౌన్‌షిప్‌లోని అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. మాదారం టౌన్‌షిప్ స‌ర్పంచ్ కుశ‌న‌ప‌ల్లి ల‌క్ష్మీనారాయ‌ణ త‌మ‌ను అవ‌మానించార‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడార‌ని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తాము గ్రామ‌స‌భ‌కు వెళ్లామ‌ని అక్క‌డ సర్పంచ్ ల‌క్ష్మీనారాయ‌ణ మాట్లాడుతూ, అంగ‌న్‌వాడీల ప‌నితీరు ఏం బాలేద‌ని మొద‌లు పెట్టి… మీరు బెంచీల మీద ఎందుకు కూర్చుంటున్నారు..? కింద కూర్చోండి… లేదంటే బ‌య‌ట కూర్చోండి అవ‌స‌రం ఉన్న‌ప్పుడు పిలుస్తారండంటూ మాట్లాడార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

అంతేకాకుండా, ఛీ… మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదంటూ దురుసుగా మాట్లాడార‌ని వెల్ల‌డించారు. తాము వయస్సురీత్యా 50 సంవ‌త్స‌రాలు పైబడిన వాళ్ల‌మ‌ని కింది కూర్చోలేక పోతున్నామ‌ని చెప్పగా ఉద్యోగాలు మానేసి ఇంట్లో కూర్చోండి అని సమాధానం ఇచ్చారని తెలిపారు. తాము 35 సంవ‌త్స‌రాలుగా అంగన్ వాడీ టీచర్లుగా విధులు నిర్వహిస్తున్నామ‌ని, అనారోగ్య కారణాల‌తో బెంచీల‌పై కూర్చున్నందుకు మ‌మ్మ‌ల్ని టీచ‌ర్లుగా, మ‌హిళ‌లుగా చూడ‌కుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడి మమ్మల్ని అవమానించారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలా మాట్లాడిన సర్పంచ్ పై చర్యలు తీసుకోవాల‌ని వారు విజ్ఞ‌ప్తి చేశారు.

You might also like