హ‌రీష్‌రావు హౌస్ అరెస్టు

హైదరాబాద్ సనత్‌నగర్ టిమ్స్‌ (TIMS) ఆస్పత్రి వ్యవహారం రాజకీయంగా వేడి రగిలించింది. టిమ్స్ ఆస్పత్రి సందర్శించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు(Former Minister Harish Rao)ను హౌస్ అరెస్ట్ చేశారు. ఆయ‌నతో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లను సైతం పోలీసులు ముందస్తుగా నిర్బంధించారు.

ఈ క్రమంలో కోకాపేట్‌లోని హరీశ్‌రావు నివాసం వద్దకు భారీగా చేరుకున్న పోలీసులు ఆయనను బయటకు రాకుండా అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. కేసీఆర్ ప్రభుత్వం నగర ప్రజలకు మెరుగైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించే లక్ష్యంతో నగరం నలువైపులా ‘టిమ్స్’ దవాఖానల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా 2022 ఏప్రిల్‌ 26న సనత్‌నగర్‌, అల్వాల్‌, ఎల్బీనగర్‌లో మూడు ఆస్పత్రుల నిర్మాణాలకు కేసీఆర్ శంకుస్థాపన చేసి, యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల సమయానికి అంటే ఏడాది కాలంలోనే ఆస్పత్రుల నిర్మాణ పనులు 60 శాతానికి పైగా పూర్తయ్యాయి.

అయితే, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పనులను నిలిపివేసి, అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కాలం గడిపిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ప్రజలు, ప్రతిపక్షాల ఒత్తిడితో తిరిగి పనులను పట్టాలెక్కించిన ప్రభుత్వం.. ఇటీవలే సనత్‌నగర్‌ టిమ్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించింది. అయితే పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించకుండానే సీఎం హడావుడిగా ప్రారంభోత్సవం చేశారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. ఆస్పత్రిలోని వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించేందుకే తాజాగా టిమ్స్ సందర్శనకు హరీశ్ రావు పిలుపునిచ్చారు.

పోలీసుల అక్రమ నిర్బంధాలు, హౌస్ అరెస్టులను మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రుల్లో డొల్లతనం, ప్రభుత్వ వైఫల్యాలు బయట పడతాయనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అరెస్టులకు పాల్పడుతోందని మండిప‌డ్డారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీతో, పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు హ‌రీష్ రావు.

టిమ్స్ సందర్శనకు సిద్ధమైన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌(Former Minister Talasani Srinivas Yadav)ను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. సనత్ నగర్, అమీర్‌పేట డివిజన్‌లకు చెందిన ముఖ్య నాయకులను సైతం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై తలసాని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆస్పత్రి ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని, వాస్తవాలను ప్రజలకు తెలిపేందుకే తాము టిమ్స్ కు వెళ్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే తమను అక్రమంగా హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

You might also like