తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జీ ఎవ‌రు..?

-తెలంగాణలో కీలక మార్పులకు రంగం సిద్ధం
-తప్పుకోనున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్
-ఉన్నత చదువుల కోసం 10 నెలల పాటు లండన్ వెళ్లనున్న మీనాక్షి
-కొత్త ఇన్‌చార్జ్ కోసం ఏఐసీసీ కసరత్తు ముమ్మరం
-రేసులో అశోక్ గెహ్లాట్, ముకుల్ వాస్నిక్
-గాంధీభవన్‌లో హఠాత్తుగా ప్రత్యక్షమైన మాణిక్ రావు ఠాక్రే

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ‘సారథి’ మార్పుకు రంగం సిద్ధమైందా..? ట్రబుల్ షూట‌ర్‌ కోసం అధిష్ఠానం పాత కాపులను రంగంలోకి దించుతోందా…? అధికారంలో ఉన్నా.. వర్గపోరు, సీనియర్ల అసంతృప్తులతో సతమతమవుతున్న టీ-కాంగ్రెస్‌కు కొత్త బాస్ ఎవరు రాబోతున్నారు..? ప్రస్తుత ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ లండన్ వెళ్తుండటంతో.. ఆ స్థానంలో ఎవరికి పట్టం కట్టబోతున్నారు..? వాస్నిక్, గెహ్లాట్ రేసులో ఉన్నా.. హైకమాండ్ మొగ్గు ఎవరివైపు ఉంది…? హఠాత్తుగా ఠాక్రే ఎందుకు ఎంట్రీ ఇచ్చారు,,,? త్వరలో జరగబోయే ఆ కీలక మార్పుల వెనుక అస‌లు ఆంత‌ర్యం ఏంటి..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మీనాక్షి నటరాజన్‌ను అధిష్టానం మార్చ‌నుంది. ఉన్నత చదువుల నిమిత్తం ఆమె విదేశాలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఆమె సుమారు 10 నెలల పాటు సెలవు తీసుకోనున్నారు. మీనాక్షి గైర్హాజరీతో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ పదవి ఖాళీ అవుతోంది. దీంతో తెలంగాణకు కొత్త ఇంచార్జ్‌ను నియమించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ కసరత్తు ముమ్మరం చేసింది.

మీనాక్షి నటరాజన్ స్థానంలో కొత్త ముఖం
మీనాక్షి నటరాజన్ గతంలోనే పది నెలల పాటు విదేశాల్లో విద్యను అభ్యసించారు. ప్రస్తుతం మరోసారి చదువు కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉండటంతో పార్టీ నాయకత్వాన్ని ఒప్పించి అనుమతి తీసుకున్నారు. ఆమె ఎన్నో రోజులుగా త‌న చ‌దువుల కోసం అధిష్టానం నుంచి అనుమ‌తి కోసం ఎదురుచూస్తోంది. ఇప్పుడు అధిష్టానం మీనాక్షి విదేశాల‌కు వెళ్లేందుకు ఒప్పుకుంది. మరో రెండు నెలల పాటు ఆమెనే పదవిలో కొనసాగించే అవకాశం ఉన్నా, ఆ తర్వాత కొత్త ఇంచార్జ్ రాక ఖాయంగా మారింది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ను సమర్థవంతంగా నడిపించగల సీనియర్ నేత కోసం అధిష్టానం వేట ప్రారంభించింది.

ద‌క్షిణాది నేత‌ల‌కే స్థాన‌మా..?
ఈ ప‌ద‌వి కోసం రేసులో చాలా మంది సీనియ‌ర్ నాయ‌కులు ఉన్నారు. అయితే, ద‌క్షిణాది రాష్ట్రాల‌కు చెందిన వ్య‌క్తుల‌కే ప‌ద‌వి కేటాయించాల‌న్న‌ది అధిష్టానం ఆలోచ‌న‌గా క‌నిపిస్తోంది. కొత్త ఇంచార్జ్ రేసులో తమిళనాడుకు చెందిన ముఖ్య నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ కోటరీలో కీలక సభ్యుడిగా, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్న ఎంపీ జోతిమణి సెంథిల్ పేరు ముందు వరుసలో ఉంది. ఆయనతో పాటు తమిళనాడుకే చెందిన మాజీ ఎంపీ చెల్లకుమార్, సీనియర్ నేత ముకుల్ వాస్నిక్‌ పేర్లను కూడా పార్టీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా వాస్నిక్‌ తెలంగాణ కాంగ్రెస్ నాయకులతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, తమిళనాడు నేతలకే ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

ముకుల్ వాస్నిక్ రేసులోకి రావడం వెనుక వ్యూహం
మీనాక్షి స్థానంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ దళిత నేత ముకుల్ వాస్నిక్ పేరు ప్రచారంలోకి వచ్చింది. ముకుల్ వాస్నిక్‌కు పార్టీలో సుదీర్ఘ అనుభవం, వివాదరహిత ఇమేజ్ ఉంది. గ్రూపు రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొనిపోయే ట్రబుల్ షూటర్‌గా పేరు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గానికి, పార్టీలోని పాత కాంగ్రెస్ సీనియర్ నాయకులకు మధ్య సమన్వయ సమరాన్ని సమర్థవంతంగా నిర్వహించగలరనే ఆలోచనతోనే హైకమాండ్ ఈ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్వపు ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే హఠాత్తుగా గాంధీభవన్‌లో ప్రత్యక్షమై వినాయకచవితి వేడుకల్లో పాల్గొనడం కూడా రాజకీయ వర్గాల్లో ఆస‌క్తి పెంచింది. ఠాక్రే హయాంలోనే తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమై అధికారంలోకి వచ్చింది. అయితే, గతంలో ఆయనను మార్చడానికి కారణమైన అంశాలు, ప్రస్తుత ప్రభుత్వ ఒత్తిళ్లు మళ్లీ పునరావృతమవుతాయా అన్నది వేచి చూడాలి.

ఎవరూ నిలబడలేకపోతున్నారు…
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా చాలా మంది ఇలా వ‌చ్చి అలా వెళ్తున్నారు. ఈ పదవి నిజంగానే కత్తి మీద సాములా మారింది. ప్రభుత్వ పాలన వేగవంతంగా సాగుతున్న సమయంలో, పార్టీ కేడర్ ఆకాంక్షలను నెరవేర్చడం ఇంచార్జ్‌కి సవాలుగా మారింది. కుంతియా నుంచి మొదలుకొని మాణిక్కం ఠాగూర్, మాణిక్ రావు ఠాక్రే, దీపా దాస్‌మున్షీ, మీనాక్షి నటరాజన్ వరకు ఎవరూ ఈ స్థానంలో ఎక్కువ కాలం ప్రశాంతంగా పనిచేయలేకపోయారు. అధిష్టానం ఆదేశాలకు, స్థానిక సీనియర్ల అసంతృప్తికి మధ్య నిత్యం నలిగిపోవాల్సి రావడం ఈ పదవికి ఉన్న అతిపెద్ద శాపంగా మారుతోంది. ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్ నేతను నియమించి శాశ్వత పరిష్కారం చూపిస్తారా..? మాణిక్ రావు ఠాక్రే వంటి పరిచిత ముఖానికే తాత్కాలిక సర్థుబాటుగా బాధ్యతలు అప్పగిస్తారా..? అనేది కొద్ది రోజుల్లో తేలనుంది. ఎవరొచ్చినా గాంధీభవన్‌లోని గ్రూపు రాజకీయాల జోరును తట్టుకుని పార్టీని సిద్ధం చేయడమే ప్రధాన లక్ష్యం కానుంది.

“ఇదీ తెలంగాణ కాంగ్రెస్‌లో ప్రస్తుతం నడుస్తున్న పొలిటికల్ టెన్షన్. గ్రూపు తగాదాలను అణిచివేసి, ప్రభుత్వం-పార్టీ మధ్య బలమైన వారధిగా నిలిచే సీనియర్ నేత కోసం ఏఐసీసీ సాగిస్తున్న అన్వేషణ తుది దశకు చేరుకున్నట్లు స్పష్టమవుతోంది. ఎవరూ స్వచ్ఛందంగా ముందుకు రాని ఈ కత్తిమీద సాము లాంటి పదవిలో.. అధిష్ఠానం ఎవరిని కూర్చోబెడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ముకుల్ వాస్నిక్, అశోక్ గెహ్లాట్ లాంటి ఉద్దండుల్లో ఆ కిరీటం ఎవరికి దక్కుతుందో తెలియాలంటే కాంగ్రెస్ హైకమాండ్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

You might also like