కాకా ఆశయాల సాధనకు కృషి చేస్తాం

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

దివంగత ప్రజానాయకుడు, తెలంగాణ ఉద్యమ యోధుడు కాకా వెంకటస్వామి ఆశ‌యాల సాధ‌న‌కు కృషి చేస్తామ‌ని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. వెంక‌ట‌స్వామి 97వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న కాకా వెంకటస్వామి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని కాకా సేవలను, పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా కాకా చూపిన ఆప్యాయత, ప్రేమాభిమానాలే ఈరోజు అన్ని వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చాయన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాకా వెంకటస్వామి చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఎంపీ అన్నారు. శరీరానికి బుల్లెట్ తగిలినా వెనక్కి తగ్గకుండా తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాకా అని కొనియాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనను కాకా చూసి ఉంటే ఎంతో బాధపడేవారన్నారు.

కాకా కార్మిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో కార్మికుల కోసం తీసుకొచ్చిన పెన్షన్ ఇప్పటికీ కేవలం రూ.500గా ఉండటం శోచనీయమని ఎంపీ పేర్కొన్నారు. కార్మికుల పెన్షన్‌ను రూ.10,000కు పెంచేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతున్నామని తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం RFCL ద్వారా సుమారు 3 వేల మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోందని, అయితే సరైన నిర్వహణ లేకుండా ఢిల్లీ పెత్తనంతో సంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందేలా RFCL యాజమాన్యం తీరుపై రాజీలేని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

కాకా వెంకటస్వామి మరో ముఖ్యమైన కల ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అని వంశీకృష్ణ తెలిపారు. ఆదిలాబాద్ ప్రాంతంలో సుమారు రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు ఇటీవల కేంద్ర మంత్రి సి.ఆర్. పాటిల్‌తో చర్చించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడి జరిగిన నేపథ్యంలో, కాకా కలను సాకారం చేసే దిశగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.

“కాకా చూపిన పోరాట బాటలోనే ప్రజా సంక్షేమం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పనిచేస్తాం. ఆయన ఆశయాలను, పోరాట స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు తీసుకెళ్లడం మనందరి బాధ్యత” అని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు

You might also like