“రిమ్స్‌లోనూ మందుబాబుల బరితెగింపు..!”

రోగులకు వైద్యం అందించే ఆసుపత్రి ప్రాంగణంలోనూ మందుబాబుల ఆగడాలు ఆగడం లేదు. కనీసం ఆసుపత్రి నిబంధనలను కూడా పట్టించుకోకుండా కొందరు మద్యం బాటిళ్లు, గుట్కా, అంబర్ ప్యాకెట్లతో లోపలికి ప్రవేశిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఆదిలాబాద్‌లోని రిమ్స్ ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగం వద్ద మద్యం బాటిల్‌తో లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది పట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రాత్రి వేళల్లో మద్యం బాటిల్‌తో ఎంట్రీ!
శుక్రవారం రాత్రి రిమ్స్ ఎమర్జెన్సీ విభాగం వద్ద ఓ వ్యక్తి మద్యం బాటిల్‌తో ఆసుపత్రిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తంగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అతడిని గుర్తించి అడ్డుకున్నారు. రోగులకు చికిత్స అందించే అత్యవసర విభాగం సమీపంలో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఆసుపత్రి భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇటీవలి కాలంలో రిమ్స్ ఆసుపత్రిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. రోగులను పరామర్శించేందుకు వచ్చే వారు, అటెండెంట్ల రూపంలో ఆసుపత్రిలోకి ప్రవేశించే కొందరు మద్యం బాటిళ్లు, గుట్కా, అంబర్ ప్యాకెట్లు తీసుకొస్తున్నారు. తనిఖీల సమయంలో ఇలాంటి నిషేధిత వస్తువులను సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకుంటున్నారు.

రోగుల భద్రతే ముఖ్యం!
ఆసుపత్రి అంటే ప్రాణాలు కాపాడే ప్రదేశం. అక్కడ మద్యం సేవించడం, మద్యం బాటిళ్లతో ప్రవేశించడం, పొగాకు ఉత్పత్తులను తీసుకురావడం వంటి చర్యలు రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు కలిగించే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రిమ్స్ అధికారులు భద్రతా తనిఖీలను నిరంతరం కొనసాగించడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘించే వారిపై తగిన చర్యలు తీసుకోవాల‌ని ప‌లువురు కోరుతున్నారు.

You might also like