సింగ‌రేణిలో సంబురాలు ఎందుకు సారూ…?

సింగ‌రేణి ఏర్ప‌డి 132 సంవ‌త్స‌రాలు అవుతోంది. కార్మికులు త‌మ చెమ‌ట‌తో, శ్ర‌మ శ‌క్తితో భూగ్భంలోని న‌ల్ల‌బంగారం వెలికి తీసి దేశానికి వెలుగులు అందిస్తున్నారు. ఒకానొక ద‌శ‌లో బీఐఎఫ్ఆర్ ప‌రిధిలోకి వెళ్లిన సంస్థ‌ను క‌ష్ట‌ప‌డి బ‌య‌ట‌కు తీసుకురావ‌డంలో కార్మికుల శ్ర‌మ అపూర్వం.. అమోఘం.. ఇలా కార్మికుల పుణ్య‌మా అని సంస్థ బ‌తికి బ‌ట్ట క‌డుతోంది. కానీ అధికారులు, కార్మిక సంఘ నేత‌లు మాత్రం అన్ని విజ‌యాలు త‌మ ఖాతాలో వేసుకుంటున్నారు. కార్మికుల‌ను అడ్డుగా పెట్టుకుని త‌మ ప‌బ్బం గ‌డుపుకుంటున్నారు. కొన్ని సంవ‌త్స‌రాలుగా సింగ‌రేణి ఆవిర్భావ వేడుక‌ల పేరిట సంస్థ పెద్ద ఎత్తున ఖ‌ర్చు చేస్తోంది. నిజంగానే సింగ‌రేణిలో సంబురాలు చేసుకునే ప‌రిస్థితి ఉందా..? కార్మికులు సంతోషంగా ఉన్నారా…? సింగ‌రేణి సంబురాల సంద‌ర్భంగా అధికారులు, కార్మిక సంఘ నేత‌ల‌కు కార్మికులు ప‌లు ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు..

1. సింగ‌రేణిలో పెద్ద ఎత్తున బ‌కాయిల బండ ఉంది..? దాదాపు 15 వేల కోట్ల బ‌కాయిలు ఉన్నాయి..? వాటి గురించి కార్మిక సంఘాలు ఎందుకు మాట్లాడ‌టం లేదు..? దీని కోస‌మే సంబురాలు చేసుకుంటున్నారా..?

2. జీతాల కోసం సింగ‌రేణి సంస్థ ప్ర‌తి నెలా బ్యాంకుల ముందు దేహీ అంటూ తిరుగుతోంది…? ఈ ప‌రిస్థితి ఎందుకు వ‌చ్చింద‌ని ఎప్పుడైనా మా ప్ర‌తినిధులుగా మీరు బాధ్య‌త తీసుకున్నారా..?

3. శ‌వాల మీద పేలాలు ఏరుకున్న‌ట్లు.. గ‌ని ప్ర‌మాదాలు జ‌ర‌గ్గానే కార్మికుల శ‌వాల‌తో రాజ‌కీయాలు చేస్తారు.. రూ.1 కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తారు..? ఆ త‌ర్వాత మ‌రిచిపోతారు. మ‌రి అలాంటి డిమాండ్ ఏమైనా సాధించార‌ని సంబురాలు చేసుకుంటున్నారా..?

4. మారు పేర్ల‌తో ఉన్న వారి రికార్డులు స‌రి చేస్తామ‌ని స్వ‌యంగా ముఖ్య‌మంత్రి హామీ ఇచ్చారు.. దాని అమ‌లు కూడా మ‌రిచారు.. దీంతో చాలా మంది కార్మికులు ఇబ్బందులు ప‌డ్డారు. కొంద‌రు త‌మ పిల్ల‌ల‌కు ఉద్యోగాలు కూడా ఇప్పించుకోలేక‌పోయారు..? అందుకేనా ఈ సంబురాలు..?

5. సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు హైపవర్‌ కమిటీ నిర్ణయించిన ప్రకారం వేతనాలు చెల్లించాలి…? దీంతో వేలాది మంది కార్మికులు చాలీచాల‌ని వేత‌నాల‌తో ప‌ని చేస్తున్నారు..? వారి కోసం ఆలోచించే దిక్కు లేదు..?

6. సింగరేణిలో ఉన్న ఓపెన్‌కాస్ట్‌లో మట్టి తొలగింపు విధానం, అండర్‌గ్రౌండ్‌ గనుల్లో కాంట్రాక్ట్‌ పద్దతి కొన‌సాగుతోంది.. సింగ‌రేణి కార్మికులు త‌గ్గి కాంట్రాక్టు కార్మికులు పెరుగుతున్నారు.. దీని విష‌యంలో మాట్లాడారా..? మ‌రి కార్మికుల‌పై ప్రేమ ఉన్న‌ట్లు ఎందుకు న‌టిస్తున్నారు..? ఆవిర్భావ సంబురాలు అందుకోస‌మేనా..?

7. సింగ‌రేణిలో చాలా ప‌నులు ప్రైవేటు ప‌రం అయ్యాయి. శానిటైజేష‌న్‌, సివిల్, ఎల‌క్ట్రిక‌ల్ మెయింట‌నెన్స్ అన్ని ప్రైవేటు ప‌రం చేసి కూర్చుకున్నారు. ఇందుకేనా మీ సంబురాలు..?

8. ఇక సింగ‌రేణి సంస్థ గొప్ప‌గా చెప్పుకుంటున్న నైనీ, శ్రీ‌పాద పాత్ర విష‌యం కూడా అంతే. భూ‌సేకరణ, పునరావాస చర్యల నుండి మొదలుకొని అన్ని పనులూ మూడవ పార్టీ చూసుకుంటుంది. బొగ్గు తవ్వుడు పనులను అదే చూస్తుంది. సింగరేణి కేవ‌లం బొగ్గు మాత్ర‌మే అమ్ముకుంటుంది…?

9. సింగ‌రేణి సంస్థ నిత్యం గొప్పులు చెప్పుకునే సింగ‌రేణి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ కూడా నిర్వ‌హ‌ణ‌తో స‌హా ప్రైవేటు సంస్థ‌లే చూస్తున్నాయి…?

10. సింగ‌రేణి ప్ర‌భుత్వ రంగ సంస్థ అనేది పూర్వ‌పు మాట‌. ఇప్పుడు దాదాపు 60 శాతం మేర ప్రైవేటీక‌ర‌ణ ప‌రం అయ్యింది. మ‌రి మీ గొప్ప‌లు ఎవ‌రి కోసం..? ఈ సంబురాలు ఎందు కోసం…?

ఇలా సంస్థ మ‌నుగ‌డే ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఖాయిలా ప‌డే ప‌రిస్థితికి చేరుకుంది. కార్మికులు సైతం తాము ప‌ని చేసే స్థ‌లాల్లో ఇబ్బందులు ప‌డుతున్నారు. స‌రైన భద్ర‌త లేక ప్ర‌మాదాల‌కు గుర‌వుతున్నారు. ఇలా ఎన్నో స‌మ‌స్య‌ల‌తో కార్మికులు స‌త‌మ‌తం అవుతున్నారు. మ‌రి ఈ సంబురాలు ఎందుకుని అధికారులు, కార్మిక సంఘ నేత‌ల‌ను కార్మికులు ప్ర‌శ్నిస్తున్నారు.. వారి వ‌ద్ద స‌మాధానం ఉందా…?

 

 

 

 

 

 

 

 

 

 

 

Get real time updates directly on you device, subscribe now.

You might also like