ఆంధ్రాకు నీళ్లు.. తెలంగాణకు కన్నీళ్లు..

రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు న‌డిప‌ల్లి విజిత్ కుమార్ ధ్వజం

మంచిర్యాల నియోజకవర్గంలో సాగునీరు అందక వేలాది ఎకరాల పంటలు ఎండిపోతున్నాయి. లక్షెట్టిపేట మండలం బలరావుపేటలో నెర్రలు బారిన పొలాలను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్ కుమార్ రైతులతో కలిసి పరిశీలించారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువేనని ఆయన మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే అసమర్థత, రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల వల్లే రైతులు రోడ్డున పడ్డారని విజిత్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

లక్షెట్టిపేట, హాజీపూర్, దండేపల్లి మండలాల్లో సాగునీరు లేక 80 శాతం పొలాలు నెర్రలు బారి ఎండిపోయాయని బీఆర్ఎస్ నేత నడిపెల్లి విజిత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అసమర్థ పాలన వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. ఎమ్మెల్యే తన వ్యక్తిగత గొడవలకు ఇచ్చే సమయం రైతుల సమస్యలపై పెట్టడం లేదని విమర్శించారు. పదిహేను రోజుల క్రితమే కడెం ప్రాజెక్టు, గూడెం లిఫ్ట్ ద్వారా నీటిని విడుదల చేసి ఉంటే రైతులకు ఈ నష్టం జరిగేది కాదన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న దివాకర్ రావు ముందుచూపుతో వ్యవహరించి ఒక్క ఎకరం కూడా ఎండకుండా కాపాడారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.

మాజీ సీఎం కేసీఆర్ పై ఉన్న కోపంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుండా రైతులను గోస పెడుతున్నారని విజిత్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ నీళ్లను ఆంధ్రప్రదేశ్ కు తరలించి తన గురువు చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ ఇచ్చుకుంటున్నారని తీవ్ర విమర్శలు చేశారు. నీళ్లు, కరెంటు ఇవ్వడం చేతకాక రైతులను పంటలు వేయొద్దని ప్రభుత్వం చెబుతోందని.. పంటలు వేయకపోతే వ్యవసాయ మంత్రి, అధికారులు ఎందుకని ఆయన నిలదీశారు. గత ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తే, నేడు అది 6 గంటలకు పడిపోయిందన్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే సాగునీరు విడుదల చేసి మిగిలిన పంటలనైనా కాపాడాలని విజిత్ కుమార్ డిమాండ్ చేశారు.

You might also like