గంజాయి సాగు గుట్టుర‌ట్టు..

తానూర్ మండలం బెంబర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న భారీ గంజాయి తోటను పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా రెండున్నర ఎకరాల పత్తి పంట మధ్య అంతర పంటగా గంజాయిని సాగు చేస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో బయటపడింది.

విశ్వసనీయ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు బెంబర్ గ్రామ శివారులోని పత్తి చేనులో తనిఖీలు నిర్వహించారు. పత్తి మొక్కల చాటున గుట్టుచప్పుడు కాకుండా పెంచుతున్న గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఘటనా స్థలానికి చేరుకుని సాగు తీరును స్వయంగా పరిశీలించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. గంజాయి సాగుకు పాల్పడిన నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. జిల్లాలో గంజాయి సాగు చేసినా, రవాణా చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని ఎస్పీ స్పష్టం చేశారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లావ్యాప్తంగా గస్తీని మరింత ముమ్మరం చేస్తామని హెచ్చరించారు.

You might also like