సమ్మె తర్వాత సైలెంట్
బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ విషయంలో కేంద్రాన్ని నిలదీస్తాం.. అవసరం అయితే నిరవధిక సమ్మెకు సైతం వెనకడాం.. కార్మికుల వెంటే ఉండి బొగ్గు బ్లాక్ ప్రైవేటీకరణ అంశంలో ముందుకు వెళ్తాం… ఇవన్నీ కొద్ది రోజుల కిందట కార్మిక సంఘ నేతలు చేసిన వాగ్దానాలు… కార్మికులకు ఇచ్చిన హామీలు. అయితే అసలు విషయానికి వస్తే కార్మిక సంఘాలు సమ్మె ద్వారా సాధించిది ఏమిటి…? సమ్మె తర్వాత సడెన్‌గా సైలెంట్ ఎందుకు అయ్యారు అనే దానిపై కార్మికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది రోజుల కిందట బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ అంశం సింగరేణి వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కేంద్రం బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు పరం చేస్తోందని ఈ విషయంలో సమ్మె చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వం దిగి రాదని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంతో సహా, ఐదు జాతీయ కార్మిక సంఘాలు రంగంలోకి దిగాయి. దీంతో కార్మికులు సైతం సమ్మెలోకి వెళ్లారు. మూడు రోజుల సమ్మె విజయవంతం అయ్యింది. మూడు రోజుల సమ్మెకు కూడా కేంద్రం దిగిరాకపోతే ఖచ్చితంగా నిరవధిక సమ్మెకు వెళ్తామని కార్మిక సంఘాలు ప్రతిజ్ఞ పూనాయి. ఆయా సంఘాలకు చెందిన నేతలు సైతం ఖచ్చితంగా నిరవధిక సమ్మె చేస్తామని భీషణ ప్రతిజ్ఞ చేశాయి.
అయితే ఈ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గలేదు. ఆగిన బొగ్గు బ్లాక్‌ల వేలం ప్రక్రియ తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కేంద్రం నాలుగో విడత బొగ్గు వేలానికి నిర్ణయం తీసుకుంది. మొత్తం 99 బ్లాక్‌ల వేలానికి సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఝార్ఖండ్, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిషా, మహారాష్ట్రతో పాటు తెలంగాణలో ఉన్న 99 బొగ్గు బ్లాక్‌లను వేలం వేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో వేలం వేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నా నాలిగింట్లో మూడింటికి టెండర్ రాలేదు. ఒకదానికి మాత్రం టెండర్ వచ్చింది. కేవలం సింగిల్ టెండర్ రావడంతో సింగరేణి కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ తాజా నిర్ణయంతో సింగరేణి కార్మికుల్లో ఆందోళన కొనసాగుతోంది.
ఇదంతా ఒక్కెత్తు కాగా, బీఎంఎస్ నేతలు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషిని కలిసిన తర్వాత సీన్ మారింది. మిగతా ప్రాంతాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన తర్వాత వాటిని కేటాయించామని మంత్రి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు తమను సంప్రదించలేదని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి సంస్థ సీఅండ్ఎండీ కూడా దానిపై కనీసం తమకు ఏ విషయం చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. బొగ్గు బ్లాక్ ల ప్రైవేటీకరణపై ముఖ్యమంత్రికి చెప్పి, కేంద్రంతో ఒప్పించాల్సిన ప్రధాన పాత్ర పోషించాల్సిన సీఅండ్ఎండీ దాని గురించి కనీసం పట్టించుకోలేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపై దృష్టి పెట్టలేదు.
దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కార్మిక సంఘాలు మౌనం వహిస్తున్నాయి. ఇప్పుడే కార్మిక సంఘాలు అసలు పోరాటం చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గానీ సింగరేణి సంస్థ తరఫున కానీ ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలు జరపలేదు కాబట్టి ఇక్కడ నుంచి ఒక బృందాన్ని పంపించి బొగ్గు బ్లాక్‌లు సింగరేణికి కేటాయించేలా చూడటం. కానీ కార్మిక సంఘాలు ఆ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కనీసం ఒక ప్రకటన కూడా చేయలేదు. కార్మిక సంఘాల మౌనం వెనక అంతరార్థం ఏమిటని పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కార్మిక సంఘాలు ఈ విషయంలో తేల్చాలని వారు కోరుతున్నారు.