అధికారుల వైఫల్యాలతోనే ప్రమాదాలు
సింగరేణిలో అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని బీఎంఎస్ నేత అప్పని శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన సోమవారం కార్మికుల పలకరింపు కార్యక్రమంలో పాల్గొని సమస్యలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అండర్ గ్రౌండ్ లో బొగ్గు వెలికి తీసిన ఖాళీ స్థలంలో ఇసుక పూడ్చే సమయంలో సరైన నిబంధనలు పాటించడం లేదన్నారు. డీజీఎంఎస్,డీడీఎంఎస్ ఇచ్చిన మార్గదర్శకాలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. దీంతో కార్మికులు తమ ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేయాల్సి వస్తోందన్నారు. కృత్రిమంగా తయారు చేస్తున్న సాండ్ (ఇసుక)లో నాణ్యత లోపాలు సరిదిద్దడంలో అధికారులు విఫలం అవుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఇసుక తయారీకి సంబంధించి శాంపిల్ పరీక్షలు చేసేవారని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. గోదావరిఖని 7 ఎల్ఈపీలో 17 మంది కార్మికులు జల సమాధి కూడా సాండ్ స్టవింగ్ సక్రమంగా చేయకపోవడం వల్ల జరిగిందే అన్నారు. కేటీకే1 ఇంక్లైన్లో సైతం సాండ్ స్థావింగ్ లో జరిగిన ప్రమాదం లో జనరల్ మాజ్దూర్ కార్మికుడు చనిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేటీకే 5,6 గనుల్లో సాండ్ స్టవింగ్ లో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తృటిలో తప్పిన ప్రమాదాలు కోకొల్లలు ఉన్నాయన్నారు. బయటకు పొక్కకుండా అధికారులు జాగ్రత్తలు పడుతున్నారని వెల్లడించారు. శనివారం కేటీకే 5 ఇంక్లైన్లో జరిగిన ప్రమాదంలో కార్మికులు తృటిలో తప్పించుకున్నారని తెలిపారు. ఈ కృత్రిమ శాండ్ తయారీలో లోపాలను సరిదిద్ది నాణ్యత గల ఇసుకతో మాత్రమే స్టవింగ్ చేయాలని బీఎంఎస్ డిమాండ్ చేస్తోందన్నారు. కార్యక్రమంలో బ్రాంచి కార్యదర్శి రేణుకుంట్ల మల్లేష్, మల్లారెడ్డి, రఘుపతి రెడ్డి, తాండ్ర మొగిలి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.