సీఎంపీఎఫ్ ఖాతాదారులకు మెరుగైన సేవలు
రికార్డులను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి - డైరెక్టర్ (పర్సనల్) శ్రీ ఎన్.బలరామ్
సీఎంపీఎఫ్ ఖాతాదారులందరికీ మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా సీఎంపీఎఫ్ సంస్థ లోని ప్రతి రికార్డు డిజిటలైజేషన్ చేయాలని సింగరేణి డైరెక్టర్ (పర్సనల్, ఫైనాన్స్, పి అండ్ పి) ఎన్.బలరామ్ అన్నారు. సీఎంపీఎఫ్ రికార్డుల డిజిటలైజనషన్ పై సీఎంపీఎఫ్ ట్రస్టీలు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ ఎన్.బలరామ్ మాట్లాడుతూ నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని సీఎంపీఎఫ్ సేవలను మరింత సరళతరం చేయాలన్నారు. ఇందుకోసం ప్రముఖ సాంకేతిక సంస్థల నుంచి సేవలను తీసుకోవాలని సూచించారు.
సీఎంపీఎఫ్‌లో ప్రస్తుతం 4 లక్షల మంది ఉద్యోగులు, 6 లక్షల మంది పింఛనర్లు సభ్యులుగా ఉన్నారని, ఇందులో సింగరేణికి చెందిన 90 వేల మంది సభ్యులు ఉన్నారని చెప్పారు. వీరందరికీ పారదర్శకంగా, ఎలాంటి జాప్యం లేకుండా సేవలు అందాలన్నారు. ఆన్ లైన్ సేవలు అందించగలిగితే ఖాతాదారుల సమస్యలను దూరం చేయవచ్చన్నారు. ఖాతాదారులకు న్యూమరిక్ ఫార్మట్‌లో ఖాతా సంఖ్యలను కేటాయించాల్సి ఉంటుందన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న ఉద్యోగుల సహకారంతో రికార్డులను డిజిటలీకరణ సాధ్యమవుతుందన్నారు. సింగరేణిలో ఈఆర్‌పీ – ఎస్‌ఏపీ ద్వారా ఉద్యోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని, అవసరమైన సీఎంపీఎఫ్ కు కావాల్సిన సాంకేతిక సహకారాన్ని ఇవ్వడానికి సిద్ధమని చెప్పారు.
సమావేశంలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ డైరెక్టర్ (పర్సనల్) డాక్టర్ సంజయ్ కుమార్, బీసీసీఎల్ డైరెక్టర్ (పర్సనల్) మల్లికార్జున రావు, సీఎంపీఎఫ్ ఉన్నతాధికారులు ఎ.కె.సిన్హా, అభిజిత్ పాల్, సింగరేణి భవన్ నుండి జీఎం (కోఆర్డినేషన్) కె.సూర్యనారాయణ, జీఎం (ఐటి) రామ్ కుమార్, డీజీఎం (ఐటి) హరిప్రసాద్, కొత్తగూడెం నుండి జీఎం (పర్సనల్ వెల్ఫెర్, సి.ఎస్.ఆర్.) బసవయ్య తదితరులు పాల్గొన్నారు.