సర్పంచ్‌కి రక్షణ కల్పించండి.. హైకోర్టు

తమకు రూ.20 లక్షలు ఇవ్వాలంటూ మావోయిస్టు నేత జగన్ పేరుతో లేఖ వచ్చిందని.. తనకు రక్షణ కల్పించాలంటూ సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు. కొండపాక మండలం సిరిసనగుండ్ల గ్రామ సర్పంచ్ గుడెపు లక్ష్మారెడ్డి ఈ విషయమై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మావోయిస్టు పార్టీ కార్యదర్శి జగన్ పేరుతో గత నెల డిసెంబర్ 17న తనకు బెదిరింపు లేఖ వచ్చిందని.. అందులో 20 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని లక్ష్మారెడ్డి తెలిపారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరింపులకు గురిచేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అదే విషయమై సిద్దిపేట పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. 18న పోలీసులను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరినా పట్టించుకోలేదని హైకోర్టు దృష్టికి తెచ్చారు.
పోలీస్ ఇన్‌ఫార్మర్ అంటూ తనను మావోయిస్టులు టార్గెట్ చేశారని.. తనకు రక్షణ కల్పించి ప్రాణాలు కాపాడాలని కోర్టును కోరారు. ఇటీవల ఏటూరు నాగారంలో కొండాపురం సర్పంచ్ రమేష్‌ను ఇదే తరహాలో పోలీస్ ఇన్‌ఫార్మర్ నెపంతో హత్య చేశారని తనకు రక్షణ కల్పించేలా పోలీసులను ఆదేశించాలని లక్ష్మారెడ్డి పిటిషన్‌లో కోరారు. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషనర్ వాదనలతో ఏకీభవించింది. తక్షణమే లక్ష్మారెడ్డికి పోలీస్ భద్రత కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సిద్దిపేట కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది.