బెల్లంప‌ల్లి ఎర్ర‌జెండాకే…

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం మార్పులు జ‌రుగుతాయో చెప్పలేం.. ఎవరు ఎవ‌రితో పొత్తు పెట్టుకుట్టారు… స‌మీక‌ర‌ణాలు ఎలా మారుతాయి…? అంచ‌నా వేయ‌డం చాలా క‌ష్టం. తెలంగాణ‌లో ప్ర‌స్తుతం అదే ప‌రిస్థితి నెలకొంది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌మ్యూనిస్టుల‌తో దోస్తీ క‌డుతున్నారు. క‌మ్యూనిస్టులు కారెక్కితే మంచిర్యాల జిల్లా బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం సీపీఐకి కేటాయించ‌నున్నారు.

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మార‌నున్నాయి. ముఖ్యంగా వ‌చ్చే ఎన్నిక‌ల‌కు సంబంధించి ఇప్ప‌టి నుంచే పొత్తులు, ఎత్తులు చేసుకుంటూ రాజ‌కీయ పార్టీలు ముందుకు సాగుతున్నాయి. దీంతో రాజ‌కీయ వేడి ర‌గులుతోంది. రెండు రోజుల కింద‌ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇచ్చిన విందు భ‌విష్య‌త్ ఎన్నిక‌ల ముఖ‌చిత్రాన్ని మార్చ‌నుంది. భార‌తీయ జ‌న‌తా పార్టీని ఎదుర్కొనేందుకు సీపీఐ, సీపీఎంల‌తో పొత్తులు పెట్టుకునేందుకు ఆయ‌న సిద్ధ‌మ‌య్యారు. పొత్తుల‌పై పూర్తి స్థాయిలో స్ప‌ష్టత రాలేదు. కానీ ఎన్నిక‌ల ముందు ఎప్పుడు పొత్తు ఏర్ప‌డిన బెల్లంప‌ల్లి సీటు మాత్రం ఖ‌చ్చితంగా సీపీఐకే కేటాయిస్తారు.

ఆ సీటు సీపీఐదే..
అన్ని పార్టీలు పొత్తుల్లో భాగంగా ఈ సీటు సీపీఐకే కేటాయిస్తున్నారు. ఇక్క‌డ సీపీఐ శాస‌న‌స‌భా ప‌క్ష నేత గుండా మ‌ల్లేష్ ఉండ‌టంతో ఆ సీటు ఖ‌చ్చితంగా ఆ పార్టీకే వెళ్లేది. గుండా మ‌ల్లేష్ అటు ఆసిఫాబాద్‌, ఇటు బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల్లో సైతం పొత్తుల్లో భాగంగా త‌మ పార్టీ త‌ర‌ఫున పోటీ చేశారు. 1983, 1985, 1994లో విజ‌యం సాధించారు. బెల్లంప‌ల్లి ప్ర‌త్యేక నియోజ‌క‌వ‌ర్గం ఏర్పాటైన త‌ర్వాత ఆయ‌న శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా సైతం ఎన్నిక‌య్యారు. ఇక 2014లో సైతం కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని సీపీఐ ఇక్క‌డ నుంచి పోటీ చేసింది. కాంగ్రెస్ నేత‌లు సీపీఐకి స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో ఇక్క‌డ గుండా మ‌ల్లేష్ ఓడిపోయారు. అటు టీడీపీ, ఇటు కాంగ్రెస్‌, చివ‌ర‌కు మ‌హాకూట‌మితో పొత్తు పెట్టుకున్నా స‌రే… బెల్లంప‌ల్లి సీటు మాత్రం సీపీఐకే ఇస్తున్నారు.

రాజ‌కీయ ప‌రిణామాలు మారితే త‌ప్ప‌..
అటు పొత్తుల ముచ్చ‌ట్లు విన‌గానే బెల్లంప‌ల్లి సీపీఐ నేత‌లు ఎగిరిగంతేస్తున్నారు. ఈ సీటు ఖ‌చ్చితంగా త‌మ‌కే కేటాయిస్తార‌నే ధీమా వ్య‌క్తం చేస్తున్నారు. బెల్లంప‌ల్లికి చెందిన రేగుంట‌ చంద్ర‌శేఖ‌ర్, తాండూరు మండ‌లం కాసిపేట‌కు చెందిన దాగం మ‌ల్లేష్ లో ఎవ‌రో ఒకరికి టిక్కెట్ ద‌క్కే అవ‌కాశం ఉంది. రేగుంట చంద్ర‌శేఖ‌ర్ ఆ పార్టీ బెల్లంప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జీగా ఉన్నారు. దాగం మ‌ల్లేష్ కూడా గ‌తంలో సీపీఐ నుంచి పోటీ చేసేందుకు సిద్ద‌మ‌య్యారు. అయితే సీనియ‌ర్ నేత గుండా మ‌ల్లేష్ ఉండ‌టంతో ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌లేదు. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రికి టిక్కెట్టు కేటాయించ‌నున్నారు. ఇక్క‌డ సింగ‌రేణిలో సీపీఐ అనుబంధ యూనియ‌న్ ఏఐటీయూసీకి గ‌ట్టి ప‌ట్టుంది. ఈ నేప‌థ్యంలో ఖ‌చ్చితంగా ఆ పార్టీకే సీటు ఇస్తారు.

ఆ ఇద్ద‌రి ప‌రిస్థితి ఏంటి..?
ఒక‌వేళ ఇక్క‌డ సీటు సీపీఐకి కేటాయిస్తే మ‌రి టీఆర్ఎస్ నేత‌ల ప‌రిస్థితి ఏమిట‌నేది అర్ధం కాకుండా ఉంది. ప్ర‌స్తుతం ఇక్క‌డ ఎమ్మెల్యేగా దుర్గం చిన్న‌య్య ఉన్నారు. ఆయ‌న రెండు సార్లు ఇక్క‌డ టీఆర్ఎస్ త‌ర‌ఫున పోటీ చేసి గెలుపొందారు. సీపీఐకి టిక్కెట్టు కేటాయిస్తే చిన్న‌య్య ప‌రిస్థితి ఏమిటనేది అంతు చిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది. ఇక ఇక్క‌డ నుంచి ఈసారి టిక్కెట్ ఆశిస్తున్న గ్రంథాల‌య సంస్థ చైర్మ‌న్ రేణికుంట్ల ప్ర‌వీణ్ రాజ‌కీయ భ‌విష్య‌త్ సైతం అగ‌మ్య‌గోచ‌రంగా మార‌నుంది. ఆయన గ‌త ఎన్నిక‌ల్లోనే టిక్కెట్ ఆశించి భంగ‌ప‌డ్డారు. ఇప్పుడు కూడా టిక్కెట్ ఆశిస్తున్నారు. ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్ ఆశీస్సులు ఉండ‌టంతో ఈసారి టిక్కెట్ త‌న‌కే అనే ఆశ‌తో ఉన్నారు. ఆయ‌న ఆశ‌ల‌పై కూడా నీళ్లు చ‌ల్లే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Get real time updates directly on you device, subscribe now.

You might also like