ప్రధాని చేసిన పనికి సంతోషం
ఆలయ సిబ్బందికి 100 జతల జ్యూట్ పాదరక్షలు పంపిన మోదీ
ప్రధాని మోదీ తన ఉదారతను చాటుకొన్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రముఖ ఆలయంలో కాశీ విశ్వనాథ్ ధామ్‌లో పని చేసే కార్మికుల కోసం 100 జతల పాదరక్షలను పంపారు. ఇటీవల ఆలయ ప్రాంగణంలో ఆయన పర్యటించిన సందర్భంగా సిబ్బంది చెప్పులు ధరించకుండా విధులు నిర్వహించడాన్ని మోదీ గమనించారు. ఇందుకు కారణం కాశీ విశ్వనాధామ్ ఆలయ ప్రాంగణంలో తోలు, రబ్బరు పాదరక్షలు ధరించడం నిషేధం. ఈ సమస్యకు పరిష్కారంగా జూట్ పాదరక్షలను అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలో కార్మికులు ఇబ్బంది పడకుండా మోదీ స్వయంగా వారి కోసం 100 జతల జ్యూట్ పాదరక్షలను పంపారు. ప్రధానమంత్రి మోడీ కాశీ విశ్వనాథ్ ధామ్ గురించి.. అక్కడ కార్మికుల గురించి నిరంతరం ఆలోచిస్తున్నారని.. వారణాసిలోని అన్ని సమస్యలపై ఆయన నిరంతరం ఆలోచిస్తుంటారని బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఆలయంలో పని చేసే పూజారులు, సేవ చేసే వ్యక్తులు, సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి ఈ పాదరక్షలు అధికారులు అందించారు. ఈ విషయాన్ని ఏఎన్ఐ ఉత్తరాఖండ్ ట్వీట్టర్ వేదికగా వెల్లడించింది.