రోజుకు 600 టన్నుల పేలుడు పదార్థాలు
ఎక్స్ ప్లోజివ్స్ తయారీదారులు, సరఫరాదారులకు డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ ఆదేశం
సింగరేణి ప్రతినిధి : ఓపెన్‌కాస్టుల్లో ఓవర్‌బర్డెన్ వెలికితీసేందుకు రోజుకు 600 టన్నులకు తగ్గకుండా పేలుడు పదార్థాలు నిరాటంకంగా సరఫరా చేయాలని పేలుడు పదార్థాలు తయారీదారులు, సరఫరాదారులను డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ ఆదేశించారు. ఉత్పత్తికి అతి కీలకమైన మూడు నెలల్లో సింగరేణి సంస్థ నిర్దేశించుకున్న 68 మిలియన్ టన్నుల లక్ష్యాలను చేరుకోవడానికి రోజుకు 14.8 లక్షల క్యూబిక్ మీటర్ల ఓబీని తీయాల్సి ఉందన్నారు. ఇందుకోసం నిర్దేశిత పరిమాణంలో పేలుడు పదార్థాలు సరఫరా చేయాలని పేర్కొన్నారు.
సింగరేణికి పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న ఎనిమిది ప్రైవేట్ సంస్థల ప్రతినిధులతో డైరెక్టర్ (ఆపరేషన్స్) చంద్రశేఖర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సగటున రోజుకు కేవలం 475 టన్నుల మేరకు మాత్రమే పేలుడు పదార్థాలు సరఫరా జరుగుతోందన్నారు. దీని వల్ల ఓవర్ బర్డెన్ లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇచ్చిన ఇండెంట్ లో 80 శాతం మేరకు సరఫరా జరుగుతోందన్నారు. దీన్ని 100 శాతానికి పెంచాలని స్పష్టం చేశారు. కొన్ని గనుల్లో బ్లాస్టింగ్ విఫలమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని వెల్లడించారు. నాణ్యమైన పేలుడు పదార్థాలు సరఫరా చేయాలన్నారు. ఇండెంట్ కు అనుగుణంగా గనులకు పేలుడు పదార్థాలు సమకూర్చాలని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా నిర్ణీత లక్ష్యాల మేరకు ఓబీ, బొగ్గు తొలగింపు కోసం ఏరియాల వారీగా వివిధ గనుల అవసరాల మేరకు కావాల్సిన పేలుడు పదార్థాలు వివరాలను జనరల్ మేనేజర్లను అడిగి తెలుసుకున్నారు. డిమాండ్ కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి చేయడానికి జాగ్రత్తగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. సమావేశంలో అడ్వైజర్ (మైనింగ్)డి.ఎన్.ప్రసాద్, జీఎం(కోఆర్డినేషన్) సూర్యనారాయణ మాట్లాడుతూ.. సరఫరా అవుతున్న పేలుడు పదార్థాలు సమర్థంగా వినియోగించుకుని, బ్లాస్టింగ్లను పకడ్బందీగా చేయాలన్నారు. పౌడర్ ఫ్యాక్టర్ మెరుగుపడేలా చూడాలని అన్ని ఏరియాల జీఎంలకు సూచించారు. ఎక్స్ ప్లోజివ్స్ తయారీ, సరఫరా సంస్థల ప్రతినిధులు మాట్లాడుతూ సింగరేణి ఇండెంట్ కు అనుగుణంగా సరఫరాను పెంచుతామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో సింగరేణి భవన్ నుంచి జీఎం (స్ట్రాటెజిక్ ప్లానింగ్) జి.సురేందర్, జీఎం (ఎక్స్ ప్లోజివ్స్) ఎల్.వి.సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.