లక్ష ఎకరాలకు సాగునీరిస్తా : బాల్క
మంచిర్యాల : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల కోసం అహర్నిశలు ఆలోచిస్తారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్పష్టం చేశారు. చెన్నూరు నియోజకవర్గంలో బుధవారం ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రైతుల ఖాతాల్లోకి 50 వేల కోట్ల రూపాయలు చేరిన సందర్భంగా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పేందుకు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టినట్లు స్పష్టం చేశారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ ముఖ్యమంత్రి గానీ, ప్రధానమంత్రి కానీ చరిత్రలో ఎన్నడూ ఆలోచించని స్థాయిలో.. తెలంగాణ రైతుల గురించి కేసీఆర్ ఆలోచించి తీసుకున్న గొప్ప కార్యక్రమం రైతుబంధు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనాటి నుంచి ఈ నెల 10 నాటికి 50 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి చేరాయన్నారు. చెన్నూరు నియోజకవర్గానికి 360 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ అయ్యాయని వెల్లడించారు. రైతుబంధు ప్రారంభమైనప్పటి నుంచి రైతుల్లో ఎనలేని సంతోషం వ్యక్తం అవుతోందన్నారు. ఈ పథకం రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఒక గొప్ప ఊతంగా మారిందని వెల్లడించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం నుంచి చిన్న సాగునీటి వనరులయిన చెరువుల బలోపేతం వరకు కనివిని ఎరుగని గొప్ప కార్యక్రమాలను కేసీఆర్ చేశారని ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో రైతుబంధు, రైతు బీమా నుంచి రైతు వేదికల వరకు రైతుల కోసం ఎన్నో అద్భుత పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. త్వరలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. 63 లక్షల మంది తెలంగాణ రైతులకు రైతుబంధు అందుతోందన్నారు. సాగువైపు కొత్త తరాన్ని మళ్లించేందుకు ఆలోచించే ప్రతి ప్రభుత్వం రైతుబంధు లాంటి కార్యక్రమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంటుందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ ర్యాలీలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి. ఎమ్మెల్సీ దండే విఠల్, మంచిర్యాల జిల్లా గ్రంథాలయ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మాజీ శాసన సభ్యులు నల్లాల ఓదెలు పాల్గొన్నారు.