మల్టిపర్పస్ వర్కర్ ఆగడాలు
మంచిర్యాల : ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ సిబ్బంది వారిని ఇబ్బంందులకు గురి చేస్తున్నారు. తమకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సేవ చేయాల్సిన వారే అసౌకర్యాలకు గురి చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బీమారం గ్రామ పంచాయతీకి చెందిన మల్టీ పర్పస్ వర్కర్ కొన్ని రోజులుగా ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగుతోంది. మండల కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి గౌడ్ గురువారం పోస్ట్ ఆఫీస్ వద్ద వితంతువులు, వృద్ధులు, వికలాంగుల వద్ద ఇంటి పన్ను పేరుతో డబ్బులు వసూలు చేశాడు. దీంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి డబ్బులు వసూలు చేయాల్సిన వ్యక్తి పోస్టాఫీసు వద్ద పెన్షన్ డబ్బులు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇవ్వని వారిని బెదిరింపులకు గురి చేశాడని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే వ్యక్తి గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్ వర్కర్‌గా, అదే గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ పంప్ డ్రైవర్‌గా నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నాడు. గ్రామ పంచాయతీలోని సాటి మల్టీ పర్పస్ వర్కర్లపై పెత్తనం చేలాయిస్తాడని ఆరోపణలు సైతం ఉన్నాయి. గతంలో పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, ఎంపీవోలకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు.