ఓపెన్‌కాస్టు బాధితుల ఆందోళన
తమకు న్యాయం చేయకుండా గ్రామాలను ఖాళీ చేయాలని సింగరేణి యాజమాన్యం ఒత్తిడి తెస్తుండటంతో బాధితులు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళితే.. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఓపెన్‌కాస్టు పరిధిలో సింగపూర్, తాళ్ళపల్లి ముంపు బాధిత గ్రామాలుగా ఉన్నాయి. వీరికి యాజమాన్యం పూర్తి స్థాయిలో నష్టపరిహారం అందించలేదు. అయినా గ్రామలను ఖాళీ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. ఆయా గ్రామాలకు వెళ్లే ఆర్.అండ్ బి. రోడ్డును సింగరేణి అధికారులు కట్ చేశారు. దీంతో ఆ గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాము ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని బాధితులు శుక్రవారం ఆందోళనకు దిగారు. బొగ్గు తరలిస్తున్న షవల్ వాహనాలను అడ్డుకొని భూ నిర్వాసితులు నిరసన వ్యక్తం చేశారు. ఓపెన్‌కాస్టు ప్రాజెక్ట్ కోసం తమ భూములు తీసుకున్న యాజమాన్యం ఇప్పుడు తమ గోడు వినడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అధికారులు, పోలీసులు నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.