పొట్టేలు తల అనుకుని…
పొట్టేలు అనుకుని యువకుని తల నరికిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లె లో కలకలం రేపింది.మదనపల్లె మండలం వలసపల్లెలో సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి కనుమ పండుగను నిర్వహించారు. ఇందులో భాగంగా ఊరి పొలిమేరలో గ్రామదేవతకు జంతు బలి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్(35) పొట్టేలను పట్టుకుని ఉన్నాడు.
మరో తలారి గంగన్న కుమారుడు చలపతి మద్యం మత్తులో పొట్టేలును నరకబోయి సురేష్ తల నరికేశాడు. తీవ్ర రక్తస్రావం అవడంతో బాధితుడిని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.