యువరైతు ఆత్మహత్య
మంచిర్యాల : భవిష్యత్ మీద ఆశతో పత్తి పంట సాగు చేశాడు.. సరైన దిగుబడి రాలేదు. అయినా ఆశతో ముందుకు సాగాడు. అకాల వర్షాలు నిండా ముంచాయి. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యే శరణ్యంగా భావించి పురుగుల మంది ఆత్మహత్య చేసుకున్నాడు.
నెన్నల మండలం గొర్రపల్లి గ్రామానికి చెందిన సరండ్ల మల్లేష్ (28) తండ్రి, అన్నతో కలిసి పత్తి పంట సాగు చేస్తున్నాడు. 15 ఎకరాల్లో పత్తి సాగుచేస్తున్నాడు. పెద్ద ఎత్తున పెట్టుబడికి ఖర్చు అయ్యింది. అయితే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దిగుబడి సక్రమంగా రాలేదు. అయినా ధర పెరిగి తనకు అనుకున్నంత వస్తుందని ధైర్యంతో ముందుకు వెళ్లాడు. పది రోజుల కిందట అకాల వర్షాలు పడటంతో పత్తి మొత్తం తడిచి నల్లగా అయ్యింది. అటు దిగుబడి సక్రమంగా రాకపోవడంతో పాటు, ఇటు అకాల వర్షాలతో ఉన్న పంటంతా పాడవటంతో దిక్కుతోచని స్థితిలో మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.
రెండు రోజులుగా చికిత్స పొందుతున్న మల్లేష్ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.