చిన్న కులపోళ్లు… గొప్పగా బతుకొద్దా..?
మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం

హైదరాబాద్ : చిన్న కులంలో పుట్టడం తన తప్పా..? అని, చిన్న కులపోళ్లు… గొప్పగా బతుకొద్దా అని మంత్రి శ్రీనివాస్ ప్రశ్నించారు. హైదరాబాద్ టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొందరు కులం ప్రాతిపదికన రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజకీయంగా ఎదుర్కోలేని శక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గౌడ్ అంటే ఏంటో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. ఎన్నికల అఫిడవిట్ టాంపరింగ్ చేశారని తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దానిని టాంపరింగ్ చేసే అవకాశం ఉండదని చిన్న పిల్లాడిని అడిగినా చెప్పారని అన్నారు. ఎన్నికల నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి కదా…? అని ప్రశ్నించారు. నా వివరణ అడగకుండా అబద్ధాలు ప్రసారాలు చేశారని అన్నారు. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. కార్లకు చలాన్ కట్టలేదనేది కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నారని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీమంత్రి- ఎంపీ నాపై కుట్ర చేశారని చెప్పారు. వారి పేర్లను త్వరలోనే ఆధారాలతో బయటపెడుతామన్నారు.