స్మితా సభర్వాల్‌కు కరోనా
ఆందోళనలో నాలుగు జిల్లాల అధికారులు, నేతలు
మంచిర్యాల : సీఎంవో కార్యదర్శి సిత్మాసభర్వాల్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. తను హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వెల్లడించారు. ఆమెకు కరోనా నిర్దారణకు ఒక్క రోజు ముందుగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన, అధికారులతో సమీక్షా సమావేశాలతో సుడిగాలి పర్యటన చేశారు. నిర్మల్ జిల్లాలోని సదర్మాట్ ప్రాజెక్టును సందర్శించి అక్కడ అధికారులతో మాట్లాడారు. కంట్రాక్టర్ల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు, నీటి పారుదల శాఖ అధికారులు ఉన్నారు. ఇక ఆదిలాబాద్ జిల్లా చనాఖా-కొరాట ప్రాజెక్టు సందర్శించిన స్మిత సభర్వాల్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్, జడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జోగు రామన్న, రాథోడ్ బాపూరావు, ఈఎన్సీ వెంకటేశ్వర్లు, సీఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్ఈ రాము, అదనపు కలెక్టర్లు నటరాజ్, షేక్ రిజ్వాన్ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో వార్దా ప్రాజెక్టు నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ ఎమ్మెల్యే కోనేరుకోనప్ప, ఆత్రం సక్కు, ఎమ్మెల్సీ దండే విఠల్, జడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి తదితరులు ఉన్నారు. తర్వాత మంచిర్యాల జిల్లాలో చెన్నూరు లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్‌తో పాటు సుందిళ్ల బ్యారేజీని పరిశీలించారు. అక్కడి నుంచి వెళ్లిపోయారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో ప్రభుత్వ విప్ బాల్క సుమన్, కలెక్టర్ భారతి హోళీకేరీ, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తదితరులు ఉన్నారు.
ఆమెతో పర్యటనలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, అధికారుల్లో భయం నెలకొంది. ముఖ్యంగా పర్యటనలో ఆమెతో పాటు ఉన్న చాలా మంది మాస్కులు పెట్టుకోకుండానే తిరిగారు. దీంతో వారిలో ఆందోళన నెలకొంది. మీడియా ప్రతినిధులు, కెమెరామెన్లు సైతం ఆందోళనకు గురవుతున్నారు.