1000 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల‌ ఏర్పాటు

- ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న సింగరేణి సంస్థ‌
- ప్రభుత్వ అనుమతి లభిస్తే పలుచోట్ల ప్లాంట్లు
- ఎస్టీపీపీలో మే వ‌ర‌కు ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంటు పూర్తి చేయాలి
- ఇప్పటి వరకూ సోలార్‌ ప్లాంట్ల ద్వారా రూ. 65.27 కోట్లు ఆదా

రాబోయే రోజుల్లో మరో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సింగరేణి సంస్థ క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇప్పటికే 219 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మిగ‌తా ప్లాంట్ల‌ను ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించే యోచనలో ఉంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించి సింగరేణి సీఅండ్ఎండీ ఎన్‌.శ్రీధర్‌ ఈ మేరకు సంబంధిత సోలార్‌ విభాగం ఉన్నతాధికారులను ఆదేశించారు.

ఆయన హైద్రాబాద్‌ లోని సింగరేణి భవన్‌ లో గురువారం సింగరేణి థర్మల్‌, సింగరేణి సోలార్‌ ప్రాజెక్టులపై డైరెక్టర్‌ ఇ అండ్‌ ఎం డి.సత్యనారాయణరావు, ఇతర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ దేశంలో బొగ్గు ఉత్పత్తితో పాటు సోలార్‌, థర్మల్‌ విద్యుత్తు రంగాలలోకి అడుగుపెట్టిన తొలి ప్రభుత్వ బొగ్గు ఉత్పత్తి సంస్థగా సింగరేణి ఖ్యాతికెక్కిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మ‌రో 1000 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల‌ ఏర్పాటుకు అధ్యయనం చేసి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు.

సమగ్ర ప్రతిపాదనలు పరిశీలించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక స‌మ‌ర్పిస్తామ‌న్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనుమతి లభిస్తే రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించే నిరూపయోగ, ఖాళీ స్థలాల్లో సోలార్‌ ప్లాంట్ల‌ను దశల వారీగా ఏర్పాటు చేస్తామ‌న్నారు. అలాగే సింగరేణి సోలార్‌ లో 3వ దశలోని 66 మెగావాట్ల ప్లాంటులకు ఏప్రిల్‌ నెలలోగా టెండర్లు పూర్తి చేయాలన్నారు. మే నుండి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. సింగరేణిలో ఏర్పాటు చేసిన 219 సోలార్‌ మెగావాట్ల సోలార్‌ ప్లాంటుల నుండి ఇప్పటి వరకూ 21.29 కోట్ల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయిందని తద్వారా సింగరేణి విద్యుత్‌ ఖర్చుల్లో సంస్థకు 65.27 కోట్ల రూపాయల మేర ఆదా అయ్యింద‌న్నారు.

సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం గడచిన 5 నెలల కాలంలో వరుసగా 90 శాతం పైగా పి.ఎల్‌.ఎఫ్‌. సాధిస్తూ దేశంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ప్లాంటుల్లో నెంబర్‌ 1 స్థానంలో ఉండటం అభినందనీయమనీ, మరిన్ని ఉన్నత ప్రమాణాలు నెలకొల్పుతూ అగ్రస్థానాన్ని కొనసాగించాలన్నారు. ఈ కేంద్రం ఈ ఆర్ధిక సంవత్సరంలో గడచిన 10 నెలల కాలంలో 6,208 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసిందన్నారు. ఇది గత ఏడాది ఇదే కాలానికి చేసిన విద్యుత్తు ఉత్పత్తి కన్నా 25 శాతం వృద్ధితో 7,737 మిలియన్‌ యూనిట్లు ఉత్పత్తి చేసిందన్నారు. మరింత మెరుగైన పనితీరుతో, పి.ఎల్‌.ఎఫ్‌. తో విద్యుత్తు ఉత్పాదన చేస్తూ ఈ ఏడాది 500 కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించాలని సూచించారు.

సమీక్ష సమావేశంలో జనరల్‌ మేనేజర్‌ సింగరేణి సోలార్ సూర్యనారాయణ రాజు, చీఫ్‌ టెక్నికల్‌ కన్సల్టెంట్ సంజయ్‌ కుమార్‌ సూర్‌, చీఫ్‌ ఓ అండ్‌ ఎం జె.ఎన్‌.సింగ్‌, జి.ఎం. (సివిల్‌) రమేష్‌ బాబు, ఎస్‌.ఇ. ఐ.ఇ. ప్రభాకర్‌ రావు తదితరులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

You might also like