ఆదిలాబాద్ బంద్ సంపూర్ణం

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూనిట్ పునఃప్రారంభించాలని చేస్తున్న బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. దీనిని తిరిగి ప్రారంభించాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.మూతపడ్డ సిమెంట్ పరిశ్రమను తెరిపించాలంటూ కొద్ది రోజులు ఆందోళనకు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సీసీఐ సాధన కమిటీ ఆదిలాబాద్ పట్టణ బందుకు పిలుపునిచ్చింది. కమిటీ సభ్యులు ఉదయం నుంచే ఆర్టీసీ బస్ డిపో ముందు బైఠాయించి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, అఖిలపక్షం నేతలు బంద్‌లో పాల్గొన్నారు. బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే సీసీఐని తెరిపించాలని ఎమ్మెల్యే రామన్న డిమాండ్ చేశారు. పట్టణంలో విద్యా,వాణిజ్య,వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. వేలాది మందికి ఉపాధి కల్పించే సీసీఐ విషయంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సాధన కమిటీ సభ్యులు మండిపడ్డారు. బందుకు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తున్నది.