మహిళలంటే చులకనా సారూ…
పోలీసులమే కదా ఏం చేసినా చెల్లుతుందనుకున్నారో..? ఏమో..? మహిళా పోలీసులే కదా చూస్తు ఊరుకుంటారాని అనుకున్నారు కావచ్చు… వారిని మాత్రం ఇబ్బందుల్లోకి నెట్టారు. నెల్లూరు పోలీస్ గ్రౌండ్ లో మహిళా పోలీస్ యూనిఫామ్ ల కోసం కొలతలు తీసుకోవడానికి సోమవారం అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగా ఆ పని కోసం మహిళా పోలీసులను నియమించాల్సి ఉండగా, ఆ పని చేయలేదు. పురుష పోలీస్ లకు డ్యూటీ వేశారు అధికారులు. ఇబ్బందిగా ఉన్నా, తప్పని పరిస్థితుల్లో మహిళా పోలీసులు కొలతలు తీయించుకోక తప్పలేదు. జిల్లా ఎస్పీ దృష్టికి కొందరు ఈ అంశాన్ని తీసుకెళ్ళగా… తప్పేముంది అని ప్రశ్నించారని మహిళా పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు పోలీస్ అధికారులకు మహిళలంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. నెల్లూరు పోలీస్ గ్రౌండ్లో మహిళా పోలీసు యూనిఫామ్ కొలతలు తీసేందుకు మగ పోలీసులను వినియోగించటం దేనికి సంకేతమన్నారు. జిల్లా ఎస్పీ కూడా దీనిని సమర్థిస్తూ తప్పేముంది అన్నట్లు చెప్పినట్లు తెలుస్తోందన్నారు. పరిశీలనకు వెళ్లిన యువజన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సాక్షాత్తు రక్షకభటులే అసభ్యానికి ఆజ్యం పోస్తుంటే సభ్య సమాజంలో మహిళలకు రక్షణేదీ? అని ఆయన ప్రశ్నించారు.