‘భీమ్లా నాయక్’ ట్యూన్స్ పై ఫిర్యాదు
పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘భీమ్లా నాయక్’ త్వరలో ఆడియన్స్ ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ‘భీమ్లానాయక్’ కూడా ఒకటి. ఈ మూవీపై ఉన్న హైప్‌కి తగినట్లే సినిమాలో పాటలకు కూడా చక్కటి రెస్పాన్స్ వస్తోంది. మేకర్స్ ఈ నెల 25న సినిమాను విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారు దర్శకనిర్మాతలు. ఇదిలా ఉంటే ఈ మూవీ మ్యూజిక్ విషయంలో కాపీరైట్ వివాదం చెలరేగినట్లు వినిపిస్తోంది. ఈ సినిమా మాతృక అయిన మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. తను ట్యూన్ లనే తెలుగు రీమేక్ ‘భీమ్లానాయక్’లో ఉపయోగించినప్పటికీ నిర్మాతలు క్రెడిట్ ఇవ్వకపోవడం పట్ల జాక్స్ అసంతృప్తిగా ఉన్నాడట.
తనకు క్రెడిట్ రాకపోవడంతో బిజోయ్ ఐపిఆర్ఎస్ (ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ)లో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నాడట. దీనిపై సంగీత దర్శకుడు థమన్ కానీ, ‘భీమ్లా నాయక్’ దర్శక నిర్మాతలు కానీ ఇంకా స్పందించలేదు. గతంలో కూడా పలు సినిమాలకు సంబంధించి కాపీరైట్ సమస్యలతో పాటు క్రెడిట్ సమస్యలు వచ్చినా వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకున్నారు. ‘భీమ్లానాయక్’ విషయంలోనూ అదే జరుగుతుందని టాక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి నటించారు. ఇదిలా ఉంటే జాక్స్ బిజోయ్ గోపీచంద్ హీరోగా మారుతు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. మరి ‘భీమ్లానాయక్’ క్రెడిట్ వివాదం ఎలా, ఎప్పుడు పరిష్కారం అవుతుందో చూడాలి.