కార్మిక సంఘాల మౌనం.. సింగరేణికి ప్రమాదం

నువ్వు కొట్టినట్టు చెయ్… నేను ఏడ్చినట్లు చేస్తా… ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే మాటలో ఇదొకటి… సింగరేణిలో జాతీయ కార్మిక సంఘాల తీరు ఇప్పుడు అచ్చు అలాగే ఉంది. మేం పోరాటం చేసినట్టు మీరు చేసేది చేసుకుంటూ వెళ్లడని ఆ కార్మిక సంఘాలు నిద్ర నటిస్తున్నాయి. సింగరేణిలో జరుగుతున్న పరిణామాలు, ప్రైవేటీకరణ ఇలా అన్ని జరిగిపోతున్నాయి.. జాతీయ కార్మిక సంఘాల పోరాటం మాత్రం ఆగడం లేదు.
సింగరేణిలో పరిస్థితులు రోజు రోజుకు మారిపోతున్నాయి. అటు బొగ్గు బ్లాక్‌ల వేలం, అంతర్గత ప్రైవేటీకరణ సాగిపోతోంది. ఇంకా అనేక రకాలైన సమస్యలు కార్మికులను చుట్టుముడుతున్నాయి. ఈ సమస్యలతోనే కార్మికులు తమ ఉద్యోగాలను వెల్లదీస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా అవి అలాగే అపరిషృతంగా ఉంటున్నాయి. అయినా వీటి గురించి పట్టించుకోవాల్సిన కార్మిక సంఘాలు అటు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. గుర్తింపు సంఘం సమస్యలపై దృష్టి పెట్టడం లేదు… కానీ, మిగతా కార్మిక సంఘాలకు ఏమైందని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటీకరణపై టీబీజీకేఎస్ పోరాటం చేస్తోంది. దీనిపై జాతీయ కార్మిక సంఘ నేతలు ఏం మాట్లాడటం లేదు.
ఏఐటీయూసీ… ఈ యూనియన్ కు ఎంతో పోరాట చరిత్ర ఉంది. నిజానికి చాలా హక్కులు ఆ యూనియన్ హయాంలోనే కార్మికులు సాధించుకున్నారు. అప్పటి నేతలు ముందుండి పోరాటం చేసి అవసరమైతే సింగరేణిని స్తంభింపచేసి మరీ కార్మికుల పక్షాన నిలబడ్డారు. దీంతో యాజమాన్యం సైతం ఆ యూనియన్ అంటేనే భయం ఉండేది. వాళ్లు అడిగిన పనులు చేసి పెట్టేవారు.. అయితే ఇదంతా గతం. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ఆ యూనియన్ కార్మికుల పక్షాన నిలబడి పోరాటం చేసింది లేదు… వారి గురించి మాట్లాడిందీ లేదు. ఇప్పుడు బొగ్గు బ్లాక్‌ల వేలానికి సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం నడుస్తోంది. అది కూడా అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. వాస్తవానికి ఈ ప్రైవేటీకరణ ప్రక్రియ ఎప్పటి నుంచో సాగుతోంది. అయినా ఆ యూనియన్ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కూడా పాత ముచ్చటే చెబుతోంది… అదే కార్మికుల కోసం ఎంతటి పోరాటాలైనా చేస్తామని.. అలాంటి నినాదాలు చెబుతూనే ఉంటారు… అటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యం తన పని తాను చేసుకుంటూ పోతుంది.
ఐఎన్‌టీయూసీ.. సింగరేణిలో ఈ యూనియన్ పాత్ర కూడా చాలా ఉంది. ఈ యూనియన్ ఆధ్వర్యంలో సంస్థలో ఎన్నో పోరాటాలు సాగాయి. ఇప్పుడు ఈ యూనియన్ కూడా చాలా బలహీనంగా మారింది. అసలు ఇప్పుడు ఇక్కడ నామమాత్రంగా మారింది. గత ఎన్నికల్లో ఆ యూనియన్‌ను వీడి చాలా మంది టీబీజీకేఎస్‌లో చేరారు. ఆ యూనియన్ పోరుబాట మరిచిపోయింది. ఇప్పుడు సింగరేణిలో ఆ యూనియన్ బాధ్యతలు జనక్ ప్రసాద్ చూస్తున్నారు. గతంలో ఆయన సాజక్‌లో పనిచేసినప్పుడు కార్మికుల కోసం అధికారులను ఎదిరించారు. కొన్ని సందర్భాల్లో దాడులు సైతం చేశారు. అలా కార్మికుల కోసం ముందుకు సాగారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఆయన సింగరేణి అధికారులు ఏం చేసినా మెచ్చుకుంటూ లేఖలు రాస్తున్నారు. కార్మికుల పక్షాన నిలబడి హక్కుల సాధన కోసం ఉద్యమించడంలో ఎలాంటి కార్యచరణ రూపొందించడం లేదు.
బీఎంఎస్… భారతీయ మజ్దూర్ సంఘ్. భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్న యూనియన్. సింగరేణిలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఖండిస్తూ కార్మికుల్లో చైతన్యం తీసుకురావాల్సింది వీరే. కానీ, మౌనం పాటిస్తున్నారు. కేవలం చిన్న చిన్న పత్రికా ప్రకటనలు తప్ప వారు ఎలాంటి కార్యాచరణ ప్రకటించలేదు. దీంతో చాలా మంది కార్మికులు కేంద్రం నిజంగానే ప్రైవేటీకరణ చేస్తోందని భావిస్తున్నారు. ఈ పాపం బీజేపీదేనని నమ్ముతున్నారు. అసలు ఈ బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ కాంగ్రెస్ పార్టీ ప్రారంభిచిందని, అందరూ దానికి మద్దతు చెప్పారని కార్మికుల్లో అవగాహన కల్పించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం కావాలనే వేలంలో పాల్గొనకుండా ఆగుతున్నారని కార్మికులకు వివరించడం లేదు. సింగరేణిలో అంతర్గత ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో పచ్చజెండా ఊపిందని, దీనికి ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీబీజీకేఎస్ దోషులను అనే విషయం కూడా చెప్పడం లేదు.
ఇలా అన్ని జాతీయ కార్మిక సంఘాలు వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయి. కార్మిక సంఘాల నేతలు తమ స్వలాభం కోసం కార్మికులను బలి చేస్తున్నారు. దీంతో సింగరేణి సంస్థ భవిష్యత్తులో కోలుకోలేని విధంగా దెబ్బతింటోంది. ఒక రకంగా ఆ సంస్థ లేకుండా పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికైనా ఈ నేతలు ముందుకు నడిచి కార్మికులను కాపాడుకుంటారో..? లేక ఇలాగే గుడ్డి నిద్ర నటిస్తారో వేచి చూడాల్సిందే.