వేధిస్తే వాట్సప్ చేయండి
=మహిళల భద్రత కోసం ప్రత్యేక వాట్సాప్ నెంబర్
= అడిషనల్ డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ ఐపిఎస్

పోలీస్ వాట్సప్ నంబర్ 6303923700
మంచిర్యాల : ఎవరైనా వేధిస్తే తమకు నేరుగా వాట్సప్ చేయవచ్చని అడిషనల్ డీసీపీ (అడ్మిన్) అఖిల్ మహాజన్ వెల్లడించారు. మహిళల భద్రత కోసం షీ టీం ప్రత్యేక వాట్సప్ నెంబర్ ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల భద్రత కోసం పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఒక్కో సబ్ డివిజన్ కి షీ టీమ్ ఇంచార్జ్ గా ఒక ఎస్ఐ, సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రేమ పేరుతో వేధించినా, బస్సులో ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అసభ్యంగా ప్రవర్తించినా వాట్సప్ నంబర్‌కు ఫిర్యాదు పంపితే చర్యలు తీసుకుంటామన్నారు. కాలేజీ కి వెళ్లేటప్పుడు లేదా వచ్చేటప్పుడు వేధించినా, ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, మీ మొబైల్ కి అసభ్యకరమైన మెసేజ్, అశ్లీల చిత్రాలు పంపినా తమకు చెప్పాలని ఆయన కోరారు. ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వేధింపులకు గురి చేసినా, సమస్యల్లో ఉన్న మహిళలు, యువతులు ఎవరైనా, విద్యార్థులు యువతులు ఎవరైనా ఫిర్యాదులు పంపితే పోలీసులు వెంటనే స్పందిస్తారని వెల్లడించారు. ఫిర్యాదు చేసిన వారు పోలీస్ స్టేషన్ కి రావడానికి ఇబ్బందిగా ఉన్నట్లయితే ఫోన్ లో మాట్లాడి వారి సమస్య పరిష్కారించి వారికి భద్రత భరోసా కల్పిస్తామన్నారు. వాట్సప్ నంబర్ ద్వారా వచ్చే ఫిర్యాదులను మహిళా భద్రత విభాగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఈ నంబరుకు వాట్సాప్ మెసేజ్‌లు, వీడియోలు, ఫొటోల వివరాలు కూడా పంపవచ్చు అని సూచించారు. సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని అఖిల్ మహాజన్ స్పష్టం చేశారు.