ఏయ్ బిడ్డా… ఇది మా అడ్డా..
-దేశం నుంచి బీజేపీని తరిమేస్తాం
-ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధం
-
-జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం
-జనగామ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
దేశం నుంచి బీజేపీని తరిమేస్తామని, మాకు ఇచ్చేవాడిని తెచ్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ కలెక్టరేట్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ దేశ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి వస్తే.. దేశం గురించి కొట్లాడేందుకు వెనుకాడమన్నారు. ఇక్కడ బయలుదేరితే.. ఢిల్లీ కోట బద్దలు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. జాగ్రత్త నరేంద్ర మోదీ.. ఇది తెలంగాణ పులిబిడ్డ. మీ ఉడుత ఊపులకు భయపడేది లేదని వెల్లడించారు. టీఆర్ఎస్ యుద్ధం చేసిన పార్టీ. పోరాటం చేసిన పార్టీ. దేశం కోసం కూడా పోరాటం చేస్తాం. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు. కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామని, ప్రస్తుతం తెలంగాణ రూపు రేఖలే మారిపోయాయన్నారు. నీటి బాధలు, కరెంట్ బాధలు పోయాయని గుర్తు చేశారు. కేంద్రం ఏం ఇవ్వకున్నా ఉన్నవాటితో సరిపెట్టుకున్నామని వెల్లడించారు. కరెంట్ సంస్కరణల పేరుతో మోటార్లకు మీరు పెట్టాలంటున్నారు. నన్ను చంపినా పెట్టనని తెగేసి చెప్పిన అని అన్నారు.
నేను చేసిన అభివృద్ధి, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మాట్లాడనని, అవన్నీ మీ కంటిముందే ఉన్నాయని ఆయన అన్నారు. జనగామ జిల్లా ఒకప్పుడు కరువుసీమగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారిందని ఆయన అన్నారు. వచ్చే ఏడాదిలోగా అన్ని చెరువులు నింపుతామని, అలాగే జనగామకు మెడికల్ కాలేజీ మంజూరు చేస్తామన్నారు. పాలకుర్తిలో కూడా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది 40 వేల కుటుంబాలకు దళిత బంధు అందించనున్నామని, మార్చి తర్వాత ప్రతి నియోజకవర్గంలో 2 వేల కుటుంబాలకు దళిత బంధు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.